హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీసెస్, డీ లచ్చిరాజు మధ్య ఉన్న సివిల్ వివాదంలో మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా, దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న వైఖరి మరింత బాధాకరమని ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీసెస్ శుక్రవారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో గల ప్లాట్ నం.89కి జంపాన ప్రభావతి, ప్లాట్ నం.90కి డీ లచ్చిరాజు యాజమానులని సర్వీసెస్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ రెండు ప్లాట్లకు కలిపి 778 చదరపు గజాల భూమికి కలిసి అనుమతులు పొంది, 5వ అంతస్థు వరకు స్లాబ్ కట్టి వదిలేశారని తెలిపారు.
ఈ సమయంలో హాస్టల్ కోసం అసంపూర్తి భవనాన్ని వినియోగించుకుంటామని ప్రభావతి, లచ్చిరాజును కోరగా, అందుకు ఒప్పుకున్న ప్రభావతి ప్లాట్‌ను కొనుగోలు చేశామని, కానీ లచ్చిరాజు మాత్రం పదేండ్లు లీజుకు ఇస్తానని, మిగతా నిర్మాణం పూర్తిచేయాలని, అక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చాక లీజు రిజిస్ట్రేషన్ చేస్తానని, నమ్మకం కోసం ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారని తెలిపారు. నిర్మాణం పూర్తయ్యాక ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీసెస్ ఏర్పాటుచేశామని, ఆ తర్వాత లచ్చిరాజు లీజు రిజిస్ట్రేషన్ చేయనని, వేరే వారికి విక్రయిస్తానని మాట మార్చినట్టు తెలిపారు. దీంతో ఈ వివాదం గత ఐదేండ్లకు పైగా కొనసాగుతుందని, వివిధ రూపాల్లో వేధింపుల కారణంగా లచ్చిరాజుపై సివిల్ రికవరీ సూట్ వేశామని తెలిపారు. అసలు తమ హాస్టల్‌కు గానీ, సివిల్ దావాలకు గానీ, ఈ వివాదానికి గానీ హరీశ్‌రావుకు ఎలాంటి సంబంధం లేదని, ఇది లచ్చిరాజుకు, తమ నడుమ ఉన్న సివిల్ వివాదం మాత్రమేనని తెలిపారు.