సిద్దిపేట, ఆగస్టు 20( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నంగునూరు: ‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలితే రంగనాయకసాగర్‌కు గోదావరి జలాలు ఎలా వచ్చాయి? ఎకడో ఒకచోట ఒక పిల్లర్ కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిందని సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గ్లోబల్ ప్రచారాలకు పాల్పడటం సిగ్గుచేటు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. రంగనాయకసాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం కూలడం కాదు రేవంత్‌రెడ్డి మైండ్ దెబ్బతిన్నదని ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్‌ను సందర్శించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా? ఎవరు వస్తారో రండి. సీఎం వస్తారా? పీసీసీ అధ్యక్షుడు వస్తారా? రండి. ఇక్కడే ప్రాజెక్టు కట్టలపైనే కూర్చుండి మాట్లాడుకుందాం’ అని సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రంగనాయకసాగర్ ఒక భాగమని ఈ ప్రాజెక్టులోకి వస్తున్న నీటిని చూసి కాంగ్రెసోళ్లు కండ్లు తెరవాలని సూచించారు. తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టంచేశారు. వరద నీరు సముద్రంలో వృథాగాపోతున్నా రేవంత్‌రెడ్డి చూసీచూడనట్టు వ్యవహరించడం దారుణమని అన్నారు. ఎల్లంపల్లి వద్ద ఐదు లక్షల క్యూసెకుల నీరు వృథాగా పోతుందని తెలిపారు.
మోటర్లు ఆన్ చేస్తే ప్రాజెక్టులు నిండుతాయని, ఫలితంగా యాసంగి పంటకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ మూసీ నదికి గోదావరి జలాలు తీసుకొస్తానని చెప్తున్న రేవంత్‌రెడ్డి ఆ జలాలను ఎకడినుంచి తెస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాళేశ్వరంపై బురద రాజకీయాలు మాని సముద్రంలో వృథాగా పోతున్న ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇంకా 213 టీఎంసీల నీళ్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టులపై రాజకీయాలు చేయడం మానుకోవాలని అన్నారు. రేవంత్‌రెడ్డి తుగ్లక్ పాలనతో రాష్ట్ర ప్రజలు ఆగమవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మాని వెంటనే మోటర్లను ఆన్ చేసి ప్రాజెక్టులన్నీ నింపాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అగ్ర తాంబూలం వేస్తే.. రేవంత్ సర్కార్ అధఃపాతాళానికి తొక్కిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి ప్రభు త్వం కుంభకర్ణుడిలా నిద్రపోతున్నదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి ముందు చూపులేకపోవడం వల్లే యూరియా కోసం రైతులు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి కనిపిస్తున్నదని మండిపడ్డారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు నానా అవస్థలు పడుతున్నారని, రైతులకు కంటి నిండా నిద్రపట్టడం లేదని అన్నారు.
గ్రామాలన్నీ యూరియా కోసం ఉద్యమిస్తున్నాయని చెప్పారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో చెప్పులకు చెక్ పెట్టి రైతుల చెంతకు యూరియా అందించిన విషయాన్ని గుర్తుచేశారు. 51 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డికి యూరియా తెచ్చే దమ్ములేదు, ఆయనకు ముందుచూపులేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి ఎమర్జెన్సీ పాలన తెచ్చారని, నోరు విప్పితే కేసీఆర్‌ను తిట్టుడు తప్ప ఏం లేదని దుయ్యబట్టారు. వెంటనే రైతులకు యూరియా అందించాలని లేకుంటే యూరియా కోసం ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.