జనగామ : రుణమాఫీ(Loan waiver) ఎగ్గొట్టి రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామంలో రుణమాఫీ కాలేదని ఆరోపిస్తూ రైతులు బ్యాంక్ ఎదుట చేపట్టిన ధర్నాకి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మొదటగా రైతు రుణమాఫీకి రూ.49,500 కోట్లు అవసరం అని చెప్పి మాట మార్చింది. చివరికి రూ.17 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిందని మండిపడ్డారు.
రుణమాఫీ కాక ఆందోళనలో ఉన్న లక్షలాది మంది రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీనిచ్చారు. పాలకుర్తి నియోజకవర్గంలో కనీసం పంట పండించుకునేందుకు రైతులకు సాగునీరు కూడా అందియలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి పూర్తిగా రుణమాఫీ చేసి రైతులకు సాగునీరు అందివ్వాలని డిమాండ్ చేశారు. కనీసం 40 శాతం కూడా రుణమాఫీ కాకముందే రుణమాఫీ అయిపోయిందని సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామన్నారు.