ఖమ్మం, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతుభరోసా పథకం అమలు చేయలేంటూ సర్కార్ చేతులెత్తేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. భద్రాద్రి జిల్లా కేంద్రంలోని కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన శనివారం ఏర్పాటుచేసిన పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశంలో పువ్వాడ మాట్లాడారు.
భద్రాద్రి జిల్లాలో గత సీఎం కేసీఆర్ నిర్మించిన సీతారామ ప్రాజెక్టును ఇప్పటి సీఎం రేవంత్ ప్రారంభించి నీళ్లు చల్లుకున్నారు గానీ రైతులకు మాత్రం సాగునీరు ఇవ్వలేక పోయారని దుయ్యబట్టారు. సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, తాటి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.