హైదరాబాద్, అక్టోబర్17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అశోక్‌నగర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీచార్జి చేసి, అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర ఒక ప్రకటనలో విమర్శించారు. నియంత పోకడలను తెలంగాణ సమాజం ఎన్నడూ సహించబోదని, కాంగ్రెస్ తన అప్రజాస్వామిక విధానాలను మార్చుకోవాలని హెచ్చరించారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు.
జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా మోసం చేసిందని మండిపడ్డారు. జీవో 29, 55పై ఎటూ తేల్చకుండా, గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో తప్పుడు ప్రశ్నల అంశాన్ని పరిషరించకుండా, తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికమో? కాదో? చెప్పకుండా, మొత్తంగా 33 కేసులు పెండింగ్‌లో ఉండగానే, ఎలాంటి హామీ ఇవ్వకుండా పరీక్ష నిర్వహిస్తే అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వారి డిమాండ్లు న్యాయ సమ్మతమైనవేనని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఒక కమిటీ వేసి గ్రూప్ 1 సమస్యను పరిషరించాలని, లేకుంటే నిరుద్యోగ యువతే కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్తుందని హెచ్చరించారు.