హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో ఖాళీగా ఉన్న లైన్‌మన్, ఇతర సాంకేతిక పోస్టుల భర్తీ కోసం రిటైర్డ్ లైన్మెన్లను విధుల్లోకి తీసుకోవద్దని, ఉపాధి కార్యాలయాల్లో (ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్) నమోదై, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన నిరుద్యోగ ఐటీఐ ఎలక్ట్రికల్ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే, వినియోగదారుల వ్యవహారాల రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడు పట్లోళ్ల శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో వేల మంది ఐటీఐ ఎలక్ట్రికల్ శిక్షణ పూర్తి చేసిన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, వీరికి విద్యుత్‌రంగానికి అవసరమైన పూర్తి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నదని తెలిపారు. భవిష్యత్‌లో విద్యుత్ సంస్థ చేపట్టబోయే లైన్‌మన్, ఇతర సాంకేతిక పోస్టుల నియామకాల్లో ఐటీఐ ఎలక్ట్రికల్ అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యమివ్వాలని శశిధర్‌రెడ్డి కోరారు.