హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక పోలింగుకు ఒకరోజు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి డ్రామాలకు తెరలేపారని జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ విమర్శించారు. నిరసన దీక్ష పేరుతో డ్రామాలాడటం ఆయనకు కొత్త కాదని అన్నారు. స్థానికేతరులు మునుగోడు నియోజకవర్గంలో ఉండకూడదన్న ఎన్నికల సంఘం నిబంధనను ధిక్కరించి మునుగోడుకు వెళ్లేందుకు బండి సంజయ్ సిద్ధమవుతున్నారని, పోలీసులు అడ్డుకోగానే నిరసన డ్రామా మొదలుపెడుతారని బుధవారం పేర్కొన్నారు. పోలీసులు అడ్డుకోగానే ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకొని బండి చేసే దొంగ దీక్షలను ప్రజలు నమ్మొద్దని కోరారు.