హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కే విజయరామారావు (85) సోమవారం కన్నుమూశారు. ఆయనకు మధ్యాహ్నం 1.30 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానకు తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ సాయంత్రం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. విజయరామారావు భౌతికకాయాన్ని మంగళవారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్-3లోని ఆయన నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నట్టు తెలిపారు. ఆయన పార్థివదేహానికి బుధవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. విజయరామారావుకు ఇద్దరు కొడుకులు ప్రసాద్‌రావు, శ్రీనివాస్ కళ్యాణ్, కుమార్తె అన్నపూర్ణ ఉన్నారు. భార్య వసుమతి నిరుడు మృతి చెందారు. ఆయన చిన్నకొడుకు ప్రసాద్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన రాగానే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.
ఏటూరునాగారం నుంచి సీబీఐ డైరెక్టర్ దాకా..
ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరునాగారంలో విజయరామారావు జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పూర్తయ్యింది. తాత (అమ్మ నాన్న) కల్యాణరావు స్వాతంత్య్ర సమరయోధుడు. వెంకటగిరిలో పెద్ద భూస్వామ్య కుటుంబం. పైచదువులకు మద్రాస్ యూనివర్సిటీలో చేరి బీఏ ఆనర్స్ పూర్తవగానే 1958 అక్టోబర్‌లో కరీంనగర్ ఎస్సారార్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగంలో చేరారు. విశ్వనాథ సత్యనారాయణ ఆ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. ఐపీఎస్‌లో ఎంపికైన ఆయన 1959 అక్టోబర్‌లో చిత్తూరు ఏఎస్పీగా విధులు నిర్వర్తించారు. 1984 ఆగస్టు సంక్షోభ సమయంలో హైదరాబాద్ కమిషనర్‌గా పనిచేశారు. అనంతరం సీబీఐ డైరెక్టర్‌గా హవాలా కుంభకోణం, బాబ్రీమసీదు విధ్వంసం, ఇస్రో గూఢచర్యం కేసు, ముంబై బాంబు పేలుళ్లు మొదలైన కేసులు దర్యాప్తు చేశారు. సర్వీసులో ఉండగానే ఎల్ఎల్బీ పూర్తిచేశారు.
ఎమ్మెల్యేగా, మంత్రిగా విశేష సేవలు
విజయరామారావు తన విశ్రాంత జీవితంలో పోలీస్ మాన్యువల్ రాశారు. అనంతరం టీడీపీలో చేరి.. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన అప్పటి అవిభాజ్య ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ అభ్యర్థి పీ జనార్దన్‌రెడ్డిపై ఎమ్మెల్యేగా గెలిచారు. ఆనాడే ఆయన్ను రోడ్లు, భవనాల శాఖ మంత్రి పదవి వరించింది. 2004లో అక్కడి నుంచే పోటీచేయగా, కాంగ్రెస్ అభ్యర్థి పీజేఆర్ విజయం సాధించారు. 2009లో దానం నాగేందర్ చేతిలో మరోసారి ఓటమి చవిచూశారు. 2016లో టీఆర్ఎస్లో చేరిన విజయరామారావు అప్పటి నుంచి పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆయనతో పాటు పార్టీలోకి వచ్చిన కార్పొరేటర్లు కాజా సూర్యనారాయణ, హేమలతాయాదవ్, అత్తలూరి విజయలక్ష్మి కూడా టీఆర్ఎస్లో చేరి 2016లో టీఆర్ఎస్ కార్పొరేటర్లుగా గెలిచారు. విజయరామారావు మృతికి మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్ సంతాపం తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్లో ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు. విజయరామారావు మృతికి మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.
సీఎం కేసీఆర్ సంతాపం
సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కే విజయరామారావు మృతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారిగా, ప్రజాప్రతినిధిగా విజయరామారావు విశేష సేవలందించారని కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో, అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. విజయరామారావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. విజయరామారావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం ఆదేశించారు.