Operation Sindoor | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ): ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్ మైండ్‌బ్లాక్ అయ్యిందని, ఇప్పుడు అది దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని మాజీ ఆర్మీ మేజర్ భరత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌పై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. పాకిస్థాన్ పూర్తి అప్రమత్తంగా ఉండగానే భారత్ అక్కడి ఉగ్రవాద అడ్డాలపై మెరుపుదాడులు చేసి తమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందని అన్నారు. భారత సేనలను అపలేకపోవడంపై పాకిస్థాన్ ప్రజలు అక్కడి ప్రభుత్వంపై పూర్తి అపనమ్మకంగా ఉన్నారని పేర్కొన్నారు. పాకిస్థాన్ ఇటీవల తామే ఇస్లాంకు సుప్రీం అని, ముస్లిం శరణార్థులకు తామే ఆశ్రయమిస్తామంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో తాము వెనక్కు తగ్గితే తమ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోతుందన్న భావనలో ఉన్నదని అన్నారు.
పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు ’ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా మారిందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే అది కయ్యానికి కాలుదువ్వుతూ చివరకు తమ క్షిపణి నిరోధక వ్యవస్థను కాపాడుకోలేని పరిస్థితి తెచ్చుకుందని అన్నారు. పాక్ దూకుడు దానికే భస్మాసుర హస్తంలా పరిణమించిందని చెప్పారు. ఓవైపు భారత్‌తో కయ్యం, మరోవైపు అంతర్గతంగా బలూచిస్థాన్, సింధు, ఖైబర్ పఖ్తుంఖ్వాలో వేర్పాటువాదుల దాడులతో పాక్‌కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌తో భారత్ తన సైనిక పాటవాన్ని చాటిందని కొనియాడారు.