హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పులుల లెక్కింపునకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. పెద్ద పులులు, చిరుత పులులు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 17 నుంచి అమ్రాబాద్, కవ్వాల్ వంటి ప్రాంతాల్లో వారంపాటు లెక్కింపు చేపట్టనున్నారు. ఈ సారి ప్రక్రియలో సామాన్య ప్రజలను భాగస్వాములు చేస్తున్నారు. ఈ మేరకు రెండు నెలల క్రితం నోటిఫికేషన్ విడుదల చేశారు. పులులను లెక్కించేందుకు ఆసక్తితో 4000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి 6000 మందిని భాగస్వాములు చేయాలని అటవీశాఖ అధికారులు భావించారు. కానీ గడువు ముగిసే నాటికి 4000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీరిని లెక్కింపు ప్రక్రియలో అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తున్నామని తెలిపారు. పులుల లెక్కింపు విధులు కేటాయించిన ప్రాంతాల్లోనే ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. లెక్కింపులో భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చిన వారిలో సాఫ్ట్వేర్, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నట్టు తెలిపారు.