హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న వన మహోత్సవానికి కంపా (కంపన్సేటరీ ఎఫరెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) నిధులతోపాటు హరితనిధికి సంబంధించిన వాటిని కూడా ఉపయోగించుకోవాలని అటవీ శాఖ ప్రధాన సంరక్షణ అధికారి సువర్ణ అధికారులను ఆదేశించారు. శనివారం అరణ్య భవన్లో జిల్లా ఫారెస్టు అధికారుల(డీఎఫ్వో)తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వన మహోత్సవాన్ని ఈ ఏడాది దిగ్విజయంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటే స్థలాల విషయంలో కలెక్టర్లతో చర్చించిన తర్వాతే ఎంపిక చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. అడవుల సంరక్షణ విషయంలో, ఈ ఏడాది పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. సమీక్షలో పీసీసీఎఫ్(అడ్మిన్) సునీత భగవత్, సీసీఎఫ్ రామలింగం, ప్రియాంకవర్గీస్, భీమానాయక్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.