హైదరాబాద్ : దేశ చరిత్రలోనే తొలిసారిగా సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఏఫ్)లోని కానిస్టేబుళ్ల నియామకం కోసం కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో (Regional languages) నిర్వహించనున్నారు. ఇన్నాళ్లూ హిందీ, ఇంగ్గిషులలో మాత్రమే నిర్వహిస్తుండటంతో ఆయా రాష్ట్రాల అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ పోలీసు ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరిగేది.
ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి వినతులు వెల్లువెత్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రాంతీయ భాషల్లోనూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆయా రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. దేశంలో 128 నగరాల్లో ఈనెల 20 నుంచి మార్చి 7 వరకు నిర్వహించే పరీక్షకు సుమారు 48 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
జాతీయ స్థాయి పరీక్షలను హిందీ, ఇంగ్లిష్తో పాటు ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR) , మంత్రి కేటీఆర్(KTR ) అనేకసార్లు కేంద్రంపై ఒత్తిళ్లులు తీసుకువచ్చారు. కేంద్ర మంత్రులకు వినతులు సమర్పించారు. ఎట్టకేలాగు స్పందించిన కేంద్రం ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో హిందీ, ఇంగ్లిషుతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో కానిస్టేబుల్ పరీక్ష ప్రశ్నపత్రాలు సిద్ధమయ్యాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నిర్వహిస్తున్న ముఖ్యమైన పరీక్షల్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పరీక్ష ఒకటి. దీనికి దేశ వ్యాప్తంగా లక్షలాది మంది యువత హాజరవుతుంటారు. ఈసారి నుంచి అన్ని 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహిస్తుండటంతో.. వచ్చే నోటిఫికేషన్‌కు మరింతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.