మాదాపూర్, సెప్టెంబర్ 27: హైదరాబాద్ మాదాపూర్‌లోని శ్రీ చైతన్య అక్షర భవన్ క్యాంపస్‌లో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సమాచారం తెలిసిన విద్యార్థి సంఘాల నేతలు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ, నవ తెలంగాణ విద్యార్థి శక్తి సంఘం ఆధ్వర్యంలో కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, వారిని కళాశాలలోనే నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత రెండురోజులుగా ఫుడ్ పాయిజన్తోపాటు వైరల్ ఫీవర్‌తో సుమారు 60 మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీజేవైఎం రంగారెడ్డి జిల్లా కన్వీనర్ నిఖిల్ చారి తెలిపారు. ఆందోళన సందర్భంగా కళాశాల గేటు అద్దాలు పగిలాయి. దీంతో పోలీసులు ఏబీవీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాలేదని, ఎవరో తప్పుగా సమాచారం ఇచ్చారని, కొందరికి వైరల్ ఫీవర్ వచ్చిందని కళాశాల ఏజీఎం శివప్రసాద్ తెలిపారు. మాదాపూర్‌లోని శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కళాశాలను శుక్రవారం చందానగర్ జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ మోహన్‌రెడ్డి, ఏఎంహెచ్‌వో రవి, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. హాస్టల్లో అపరిశుభ్రత ఉండటంతో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ చైతన్య కళాశాలకు రూ.2 లక్షల జరిమానా విధించారు.