రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో బుధవారం పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వ నియంత్రణ కొరవడడంతోనే ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు.
ధన్వాడ, జనవరి 29 : నారాయణపేట జిల్లా ధన్వాడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం తర్వాత ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. మరో 19 మంది విద్యార్థులు కడుపునొప్పి అనడంతో సిబ్బంది హెచ్ఎం నర్సింహాచారికి విషయం తెలిపారు. ప్రభుత్వ దవాఖాన డాక్టర్ అనూష సిబ్బందితో పాఠశాలకు చేరుకొని విద్యార్థులను పరీక్షించారు. కలుషిత ఆహారం, నీటి కారణంగా అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. విద్యార్థులకు మినరల్ వాటర్‌ను అందిస్తున్నామని హెచ్ఎం తెలిపారు.
ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో..
ఎల్లారెడ్డి రూరల్, జనవరి 29: ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 16మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, దవాఖానకు తరలించి చికిత్స అందించారు. కోలుకున్న వారిని డిశ్చార్జ్ చేశారు. నలుగురు విద్యార్థులు దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో..
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహంలో 170 మంది విద్యార్థినులు ఉంటూ సమీప పాఠశాలల్లో చదువుకుంటున్నారు. బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం తొమ్మిదో తరగతి విద్యార్థినులు ఆర్ దుర్గ, ఎస్ మహేశ్వరి, ఎనిమిదో తరగతి ఆర్ కనిష్మ, బీ అక్షిత, ఆరో తరగతి బీ పూజిత వాంతులు చేసుకున్నారు. వసతి గృహం సిబ్బందికి పట్టణంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. వసతి గృహం వద్దకు వెళ్లిన మీడియా ప్రతినిధులకు విద్యార్థినులు ఏ దవాఖానలో చికిత్స పొందుతున్నది చెప్పకుండా అధికారులు దాచారు. తాము చెప్పిన వివరాలే మీడియాకు చెప్పాలి అన్నట్టు విద్యార్థినులను సన్నద్ధం చేసినట్టు స్పష్టంగా కనిపించింది. సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, ట్రైబల్ వెల్ఫేర్ జిల్లా అధికారి శంకర్ విద్యార్థినులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు.