నాగర్కర్నూల్: రాష్ట్రంలోని మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ (Food Poison) అయింది. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో ఉన్న మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో (Gurukula School) రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో 79 మంది బాలికలను పాఠశాల సిబ్బంది దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు వెల్లడించారు. 12 మంది డిశ్చార్జి అవగా, ఇంకా 67 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. పూర్తిగా తోడుకోని పెరుగు తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తున్నది.
కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి గురుకుల, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పరిపాటిగా మారాయి. పలువురు విద్యార్థులు మరణించినప్పటికీ సర్కార్లో చలనం రావడం లేదు. వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడంలేదు. ఈ నెల 21న సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని మొర్గి ఆదర్శ పాఠశాల హాస్టల్లో సోమవారం ఫుడ్ పాయిజన్తో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మొర్గి మాడల్ స్కూల్లో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం కలిపి 70 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆదివారం రాత్రి చికెన్ తిన్న 11 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురికాగా వాచ్మన్ నారాయణఖేడ్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఈ నెల 14న నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు.. పాఠశాలలో సుమారు 310 మంది విద్యార్థినులు ఉండగా ఆదివారం సాయంత్రం విద్యార్థినులకు స్నాక్స్, పెసర గుగ్గిళ్లు అందించారు. రాత్రి భోజనం బగారాతో చికెన్ వడ్డించారు. రాత్రి భోజనం తర్వాత కొందరు విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడటంతోపాటు విరేచనాలు చేసుకున్నారు. సోమవారం ఉదయం అల్పాహారంగా పులిహోర తిన్న తర్వాత 35మంది తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలతో బాధపడుతుండగా, పాఠశాల ఏఎన్ఎం, టీచర్లు 13మంది విద్యార్థినులను దేవరకొండ దవాఖానలో, తూర్పుపల్లి పీహెచ్సీలో 22మందిని చేర్పించారు.