హైదరాబాద్, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ ): ప్రకృతి ప్రసాదించిన వరం దేశీయ విత్తనాలని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అనాస్పల్లి ది ఎర్త్ సెంటర్ ప్రాంగణంలో శుక్రవారం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, భారత్ బీజ్ స్వరాజ్మంజ్ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ తొలి విత్తన వార్షికోత్సవ పండుగ ప్రారంభమైంది. ఈ కార్యక్రమం మూడ్రోజులపాటు జరుగనున్నది. మొదటి రోజు ముఖ్య అతిథులుగా కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ డాక్టర్ దండ రాజిరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ డాక్టర్ పురుషోత్తంరెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే సంప్రదాయ, దేశీయ పంటలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన దేశీయ విత్తనాలు కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. బహుళజాతి కంపెనీలు హైబ్రిడ్ విత్తనాలను రైతులపై రుద్దుతున్నాయని తెలిపారు.