హైదరాబాద్ : అన్ని దానాల కంటే అన్నదానం(Food donation) గొప్పదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. శుక్రవారం సనత్ నగర్ లోని బీకే గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న మిత భోజన కేంద్రం, చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి కడుపునిండా భోజనం పెట్టడం గొప్ప సేవా కార్యక్రమమని నిర్వాహకులను అభినందించారు. ప్రతి సంవత్సరం వేసవిలో 60 రోజుల పాటు ఉచితంగా భోజనం వడ్డించే కేంద్రాన్ని గత 12 సంవత్సరాలు గా నిర్వహిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు. సనత్ నగర్ లోని సీనియర్ సిటిజన్స్ సమాజానికి సేవ చేయాలనే తలంపుతో అనేక సామాజిక సేవా కార్యక్రమాల శ్రద్ద చూపడం ఆనందంగా ఉందన్నారు.
సనత్నగర్ పరిధిలో రోడ్లు, పార్క్ ల అభివృద్ధి, డ్రైనేజీ, వాటర్ వంటి అనేక సమస్యలను పరిష్కరించానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ బాల్ రెడ్డి, సీనియర్ సిటిజన్స్ పార్థసారధి, మానిక్ పటేల్, ప్రసాద్, సహదేవ్ గౌడ్, రజని రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి సురేందర్ సింగ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
మోడల్ కాలనీలో..
మోడల్ కాలనీలో మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం, చలివేంద్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ బాల్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొండల్ రావు, బుచ్చిబాబు, మనెమ్మ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.