న్యూఢిల్లీ, ఆగస్టు 5: రిజర్వ్‌బ్యాంక్ కీలక రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర పెంచడంతో వడ్డీ రేట్లతో ప్రభావితమయ్యే బ్యాంక్, రియల్టీ, ఆటోమొబైల్ షేర్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. బ్యాంకింగ్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ 2.26 శాతం పెరగ్గా, యాక్సిస్, ఫెడరల్ బ్యాంక్‌లు స్వల్పంగా లాభపడ్డాయి. మరోవైపు బంధన్ బ్యాంక్ 1.7 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.30 శాతం చొప్పున తగ్గాయి. ప్రభుత్వ రంగ ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాలు, ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ బ్యాంక్‌లు స్వల్పంగా తగ్గాయి.
ఆటోమొబైల్ షేర్లలో మహీంద్రా, ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి, హీరోమోటోలు 2 శాతం వరకూ క్షీణించాయి. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్‌లు సైతం తగ్గాయి. టీవీఎస్ మోటార్స్ 1.4 శాతం మేర ర్యాలీ జరిపింది. రియల్టీ కౌంటర్లలో సన్‌టెక్ రియల్టీ, గోద్రేజ్ ప్రాపర్టీస్, 1.25 శాతం వరకూ తగ్గగా, ఫినిక్స్ మిల్స్ 1.6 శాతం పెరిగింది. ప్రధాన సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనై, స్వల్ప లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 89 పాయింట్ల లాభంతో 58,388 పాయింట్ల వద్ద నిలిచింది. నిఫ్టీ 15 పాయింట్లు లాభపడి 17,397 పాయింట్ల వద్ద ముగిసింది.