హైదరాబాద్, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ): టెండర్లలో ధాన్యం దక్కించుకున్న బిడ్డర్లకు ధాన్యం ఎత్తేందుకు ఇచ్చిన గడువును పదేపదే పొడగిస్తుండటంతో పౌర సరఫరాల సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సకాలంలో ధాన్యం ఎత్తకుండా, నిబంధనలను అతిక్రమిస్తున్న బిడ్డర్లపై ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు గడువు పొడగించిన సంస్థ.. మరోసారి పొడగించడంపై విమర్శలకు తావిస్తున్నది. అదే సమయంలో మిల్లర్లపై వివిధ రకాల తనిఖీల పేరుతో పౌరసరఫరాల సంస్థ ఉక్కుపాదం మోపుతున్నది. ఈ విధంగా మిల్లర్లు, బిడ్డర్లపై పౌరసరఫరాల సంస్థ ద్వంద్వ వైఖరిని అవలంభించడం అనుమానాలకు తావిస్తున్నది.
2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించిన దాదాపు రూ.ఏడువేల కోట్ల విలువైన 35 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ గత జనవరిలోనే వేలం వేసింది. ఇందులో నాలుగు కంపెనీలు ధాన్యాన్ని దక్కించుకున్నాయి. ఫిబ్రవరి 23న ఈ కంపెనీలకు కన్ఫర్మేషన్ లెటర్లు జారీ చేసిన సంస్థ… 90 రోజు ల్లో మొత్తం ధాన్యాన్ని తీసుకెళ్లాలని పేర్కొన్నది. కానీ, కంపెనీలు గడువులో ధాన్యాన్ని ఎత్తకపోవడంతో మరోసారి రెండు నెలల గడువు పొడగించింది. అయినప్పటికీ ఎత్తకపోవడంతో మరో రెండు నెలల గడువు ఇచ్చిం ది. ఇది కూడా సెప్టెంబర్ 23తో ముగిసింది. అప్పటికీ కంపెనీలు ధాన్యం ఎత్తలేదు. దీంతో డిసెంబర్ ఆఖరు వరకు మరోసారి గడువు పొడగించింది. ఇప్పటివరకు సదరు కంపెనీలు కేవలం రూ.రెండు వేల కోట్ల విలువైన 10 లక్ష ల టన్నులు మాత్రమే ఎత్తినట్టు తెలిసింది.
నిర్ణీత గడువులో టెండర్‌దారులు లక్ష్యాన్ని చేరుకోకపోతే వారిపై చర్యలు తీసుకోవడమనేది టెండర్ ప్రక్రియలో సాధారణ నిబంధన. కానీ, ధాన్యం ఎత్తడంలో విఫలమైన బిడ్డర్లలో ఏ ఒక్కరిపై కూడా పౌరసరఫరాల సంస్థ చర్య లు తీసుకోలేదు. దీంతో బిడ్డర్లతో అధికారులు కుమ్మక్కయ్యారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పౌర సరఫరాల సంస్థలోని పలువురు అధికారులు బిడ్డర్లపై ఈగ వాలకుండా చూసుకుంటున్నారని, బిడ్డర్లు ఎలా చెప్తే అలా వింటున్నారనే ప్రచారం జరుగుతున్నది. అధికారుల నిర్లక్ష్యం, బిడ్డర్లపై ఉదాసీనత కారణంగా పౌరసరఫరాల సంస్థపై ఆర్థిక భారం పడుతున్నది. ధాన్యం విక్రయం వల్ల మూడు నెలల్లో రూ.ఏడు వేల కోట్లు వస్తాయని సంస్థ అధికారులు చెప్పారు. కానీ, ఇప్పుడు అసలు 7వేల కోట్లు రాకపోగా.. వడ్డీ భారం పడుతున్నది. ప్రతి నెలా సుమారు రూ.50 కోట్ల వరకు పౌరసరఫరాల సంస్థ వడ్డీ చెల్లించాల్సి వస్తున్నది. ఇప్పటివరకు రూ.350 కోట్ల వరకు వడ్డీ చెల్లించినట్టు తెలిసింది. ఇప్పు డు డిసెంబర్ వరకు గడువు పొడగించడంతో ఈ భారం రూ.500 కోట్లకు చేరుతుందని ఆ సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు.
బిడ్డర్లు ధాన్యం ఎత్తకపోగా, ధాన్యానికి బదులు డబ్బులు ఇవ్వాలని మిల్లర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. టెండర్లో సగటున క్వింటాల్‌కు రూ.రెండు వేల చొప్పున దక్కించుకోగా, ధాన్యం బదులుగా తమకు రూ.2,230 చొప్పున చెల్లించాలని మిల్లర్లను బిడ్డర్లు బెదిరిస్తున్నట్టు తెలిసింది.
పలువురు మిల్లర్లు కూడా ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు బడా మిల్లర్లు బాయిల్డ్‌రైస్‌ను తమిళనాడులో విక్రయించగా, మరికొంత భాగాన్ని విదేశాలకు దొడ్డిదారిన ఎగుమతి చేశారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణ చేపట్టినట్టు సమాచారం. వరంగల్ జిల్లాకు చెందిన మణికంఠ కన్వేయర్స్ ద్వారా ఈ వ్యవహారం సాగినట్టు విజిలెన్స్ విభాగం గుర్తించింది. దీనిపై ఆయా మిల్లర్లకు నోటీసులు జారీ చేసింది.