హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో నాలుగు బొగ్గు గనులకు జాతీయ స్థాయిలో ఫైవ్ స్టార్ అవార్డులు లభించాయి. ఈ మేరకు గురువారం ముంబైలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీ ఎన్ బలరాం అవార్డులను అందుకున్నారు.
ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్న గనుల్లో రామగుండం-3 ఏరియాకు చెందిన ఆర్జీవోసీ-1 ఎక్స్టెన్షన్, ఇల్లందు ఏరియాకు చెందిన జేకే-5 ఓసీ, శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన ఆర్కే-6 గని, ఆర్కే న్యూటెక్ గనులు ఉన్నాయి. కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది దేశంలో అత్యుత్తమ గనులకు స్టార్ రేటింగ్‌ను ఇస్తూ, అత్యుత్తమ స్టార్ రేట్ సాధించిన గనుల యాజమాన్యాలకు ఈ అవార్డులను అందిస్తున్నది.