కొల్లాపూర్, జూలై 29: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు (పీఆర్ఎల్ఐ) పనుల్లో అపశృతి చోటు చేసుకొన్నది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు శివారులో రేగుమాన్గడ్డ వద్ద పీఆర్ఎల్ఐ లిఫ్ట్-1 పంప్‌హౌస్‌లో గురువారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారు.
ఏపీలోని రాజమండ్రికి చెందిన సెక్యూరిటీ గార్డుకు గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. పంప్‌హౌస్‌లో అడుగు భాగంలో కాంక్రీట్ పనుల కోసం కూలీలు బోలోనాథ్ (25), శ్రీను (22), ప్రవీణ్ (24), సోను (26), కమలేశ్ (23), సెక్యూరిటీ గార్డు భారీ క్రేన్‌లో వెళ్తుండగా, షార్ట్ సర్కూట్ అయ్యి క్రేన్ వైర్లు తెగిపోయాయి. దీంతో క్రేన్ బకెట్ అమాంతం అడుగుభాగానికి పడిపోయింది.
దీంతో తీవ్ర గాయాలపాలైన కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను, క్షతగాత్రుడిని హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానకు తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దవాఖానలో బాధిత కుటుంబాలను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని రఘువర్ధన్‌రెడ్డి హామీ ఇచ్చారు.