హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను తక్షణమే విడుదల చేయాలని లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ (జీటీఏ) కోరింది. ఉద్యోగులకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు వీరాచారి, ప్రధాన కార్యదర్శి మేకల లక్ష్మీకాంత్‌రెడ్డి, కోశాధికారి ఎం నళిని, మహిళా కార్యదర్శి కే సుకన్య సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టు పాఠశాలల రేషనలైజేషన్‌ను చేపట్టాలని సూచించారు. జిల్లా పరిషత్ హెచ్ఎంలకు ఎంఈవో అదనపు బాధ్యతలివ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని, ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్లకు ఎంఈవోగా బాధ్యతలప్పగించాలని కోరారు.