హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగా ణ) : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో ఐదు డిగ్రీకాలేజీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. నిజామాబాద్ జిల్లా మద్నూరు, భదాద్రి కొత్తగూ డెం జిల్లా అశ్వారావుపేట, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలకు నూతనంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను మంజూరుచేసింది. గడిచిన మూడేండ్లలో కొత్తగా 15 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వీటిలో హాలియా, మహేశ్వరం, వికారాబాద్, పరిగి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ధన్వాడ, మక్తల్, బడంగ్‌పేట కాలేజీలున్నాయి. తాజాగా మరో కాలేజీని ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది. 2023 -24 నుంచే వీటిని ప్రారంభిస్తారు. వీటిల్లో బీకాం కంప్యూటర్‌సైన్స్, బీఏ, బీఎస్సీ లైఫ్‌సైన్సెస్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ కోర్సులను నిర్వహించనున్నారు. ఈ కాలేజీల్లో దోస్త్ ప్రత్యేక విడతల్లో సీట్లను భర్తీచేస్తారు. కొత్త కళాశాలల ఏర్పాటుతో రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల సంఖ్య 141కి చేరింది.