ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 01, 2021 , 02:31:42

తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా సీజే

తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా సీజే

  • జస్టిస్‌ హిమాకోహ్లీ నియామకంపై రాష్ట్రపతి ఉత్తర్వులు
  • మధ్యవర్తిత్వంలో నైపుణ్యం కలిగిన జస్టిస్‌ హిమాకోహ్లీ  పలు కమిటీల్లో పనిచేసిన అనుభవం గడించారు. పర్యావరణ పరిరక్షణలో న్యాయవ్యవస్థ, కుటుంబ వివాదాల్లో ఫ్యామిలీ కోర్టుల పాత్రపై అధ్యయనం చేయడంతోపాటు పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రాలను సమర్పించారు.

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు తొలి మహిళా చీఫ్‌జస్టిస్‌గా జస్టిస్‌ హిమాకోహ్లీ నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్న ఆమెకు పదోన్నతి కల్పించారు. హిమాకోహ్లీని తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫారసు చేయగా కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఆమెను తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా నియమిస్తూ గురువారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేశారు. ఆమె విధుల్లో చేరినప్పటి నుంచి నియామకం అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2019 జనవరి 1న  తెలంగాణ హైకోర్టు ఏర్పడింది. తొలి చీఫ్‌ జస్టిస్‌గా తొట్టతిల్‌ బీ రాధాకృష్ణన్‌ వ్యవహరించారు. తర్వాత రాఘవేంద్రసింగ్‌చౌహాన్‌ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మూడో చీఫ్‌ జస్టిస్‌గా హిమాకోహ్లీ నియమితులయ్యారు.  

మధ్యవర్తిత్వంలో నైపుణ్యం.. పర్యావరణ పరిరక్షణపై దృష్టి 

హిమాకోహ్లీ జడ్జిగా విధులను నిర్వహిస్తూనే మధ్యవర్తిత్వాన్ని ప్రత్యామ్నాయ పరిష్కార సాధనంగా ప్రోత్సహిస్తారు. మధ్యవర్తిత్వంలో నైపుణ్యం కలిగిన ఆమె.. పలు కమిటీల్లో పనిచేసిన అనుభవం గడించారు. సెప్టెంబర్‌ 2, 1959లో ఢిల్లీలో జన్మించిన హిమాకోహ్లీ తన పాఠశాల విద్యను ఢిల్లీలోని సెయింట్‌ థామస్‌ పాఠశాలలో పూర్తిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీలో గ్రాడ్యుయేషన్‌, పీజీ పూర్తి చేసి.. అదే వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 1984లో ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. వివిధ హోదాల్లో పనిచేశారు. 2006 మే 29న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2007 ఆగస్టు 29న పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పర్యావరణ పరిరక్షణలో న్యాయవ్యవస్థ, కుటుంబ వివాదాల్లో ఫ్యామిలీ కోర్టుల పాత్రపై అధ్యయనం చేయడంతోపాటు పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రాలను సమర్పించారు.

ప్రజాప్రయోజనానికి ప్రాధాన్యమిచ్చిన జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ 

ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ను ఉత్తరాఖండ్‌ చీఫ్‌ జస్టిస్‌గా బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. దీనిని సైతం ఆమోదిస్తూ గురువారం రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. 2019 ఏప్రిల్‌ నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా ఆర్‌ఎస్‌ చౌహాన్‌ ప్రజాప్రయోజనాలకు పెద్దపీట వేశారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను మానవతా దృక్పథంతో పరిష్కరించేందుకు కీలక తీర్పులు వెలువరించారు. ఆయన హయాంలో సచివాలయం కేసు, ఎర్రమంజిల్‌ కేసు, ఎమ్మెల్సీల అనర్హత, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు కేసుల్లో కీలక తీర్పులు వెలువడ్డాయి.


logo