మూసీ సుందరీకరణ మాస్టర్‌ప్లాన్ తయారీ కన్సల్టెన్సీ బాధ్యతలను దేశ, విదేశాల్లోని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ కంపెనీలను కాదనుకొని మరీ వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన సింగపూర్‌కు చెందిన ‘మెయిన్‌హార్ట్’ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను ఆశించే ఆ కంపెనీకి ఈ ప్రాజెక్టు బాధ్యతలను సర్కారు అప్పగించిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్-1 కంపెనీని కాదని ‘మెయిన్‌హార్ట్’కు మూసీ ప్రాజెక్టును అప్పగించడం, ప్రాజెక్టు అంచనా వ్యయం ఏకంగా మూడు రెట్లు పెరిగిపోవడం, మెయిన్‌హార్ట్ కంపెనీపై దేశ విదేశాల్లో వివిధ కేసులు నమోదైనా.. సర్కారు వాటన్నింటినీ పట్టించుకోకపోవడం.. వెరసి ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది.
గత కేసీఆర్ ప్రభుత్వం ఏ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టినా.. ప్రఖ్యాత కంపెనీలకు, ప్రసిద్ధ నిపుణులకు మాత్రమే బాధ్యతలను అప్పగించింది. అందుకే, సకాలంలో ఆయా ప్రాజెక్టులు పూర్తయ్యి అందుబాటులోకి వచ్చాయి. అయితే, మూసీ సుందరీకరణపేరిట ప్రాజెక్టు కన్సల్టెన్సీ బాధ్యతలను రేవంత్ ప్రభుత్వం వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన సింగపూర్ కంపెనీ మెయిన్హార్ట్కే పట్టిపట్టి ఎందుకు ఇచ్చిందన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతున్నది.
Meinhardt | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఎక్కడో సింగపూర్‌కు చెందిన మెయిన్హార్ట్పై కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత ఆసక్తి ఏమిటన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతున్నది. మూసీ రివర్‌ఫ్రంట్ మాస్టర్‌ప్లాన్ తయారీ కన్సల్టెన్సీ బాధ్యతలను ఈ సంస్థకు అప్పగించడం వెనుక రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు కారణమన్న ఆరోపణలూ చుట్టుముడుతున్నాయి.
మూసీ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ కోసం గత ఫిబ్రవరి 5న ప్రభుత్వం తొలి టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ టెండర్లో తెలంగాణకు చెందిన సాయి కన్సల్టెన్సీ రూ. 60 కోట్లతో ఎల్-1గా నిలవగా, ట్రాక్ట్బెల్ అనే కంపెనీ రూ. 75 కోట్లు కోట్ చేసి ఎల్-2గా నిలిచింది. అయితే, ఫిబ్రవరి 6న సీఎం రేవంత్‌రెడ్డిని మెయిన్‌హార్ట్ ప్రతినిధులు సచివాలయంలో ప్రత్యేకంగా కలిసి మూసీ ప్రాజెక్టుపై తమ ఆసక్తిని కనబర్చారు. అనంతరం.. జూలై 6న ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో రేవంత్‌తో భేటీ అయ్యారు.
ఇది జరిగిన 15 రోజుల్లోనే మూసీ గత టెండర్లను రద్దు చేసిన ప్రభుత్వం.. కొత్తగా మళ్లీ బిడ్లను ఆహ్వానించింది. ఈసారి రెండు కంపెనీలు మెయిన్‌హార్ట్, లీ అసోసియేట్స్ మాత్రమే బిడ్లు దాఖలు చేశాయి. రూ. 141 కోట్లకు బిడ్ వేసిన లీ అసోసియేట్స్ ఎల్-1గా నిలవగా, రూ. 143 కోట్లకు బిడ్ వేసిన మెయిన్‌హార్ట్ ఎల్-2గా నిలిచింది. అయితే, సాంకేతిక కారణాల పేరిట ఎల్-1గా నిలిచిన లీ అసోసియేట్స్‌ను కాదని, మూసీ ప్రాజెక్టు మాస్టర్ ప్లాన్ బాధ్యతలను ప్రభుత్వం మెయిన్‌హార్ట్‌కు అప్పగించింది.
చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నగరాభివృద్ధి బాధ్యతను సెమ్కాప్ అండ్ అసెండర్స్ సింగ్‌బ్రిడ్జ్ కంపెనీకి అప్పగించింది. ఈ కంపెనీ సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్‌కు చెందినది. మెయిన్‌హార్ట్ కంపెనీకి సెమ్కాప్ అనుబంధ సంస్థగా చెప్తారు. అలా అమరావతి ప్రాజెక్టు ఒకవిధంగా మెయిన్‌హార్ట్‌కు దక్కినట్లయ్యింది. ఇక, జూలైలో చంద్రబాబుతో భేటీ తర్వాతనే మూసీ ప్రాజెక్టు మెయిన్‌హార్ట్‌కు ఖరారైంది. దీంతో మూసీ ప్రాజెక్టు ఖరారు వెనుక బాబు వ్యూహం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీన్ని బలపరుస్తూ.. అటు అమరావతికీ, ఇటు మూసీ ప్రాజెక్టుకూ నిధులివ్వడానికి చైనాలోని న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) సుముఖత వ్యక్తంచేసింది. బాబుకు మిత్రుడిగా పేరున్న ఎన్డీబీ డైరెక్టర్ జనరల్ పాండ్యన్ సహకారంతోనే ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు ఖరారైనట్టు తెలుస్తున్నది. కాగా పాండ్యన్ గతంలో గుజరాత్ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ఈయన ప్రధాని మోదీకి కూడా మంచి మిత్రుడిగా చెప్తారు. అలా.. రాజకీయంగా ఎన్నో రకాలుగా విధాలుగా ముడిపడిన మెయిన్‌హార్ట్ కంపెనీని ఇక్కడి రేవంత్ ప్రభుత్వం మూసీ ప్రాజెక్టుకు ఎంపిక చేసినట్టు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ సహా పలు రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి.
అమరావతి రాజధాని గ్రాఫిక్స్ మాయాజాలం ఏపాటిదో.. ఇటీవల వరదలతో తేలిపోయింది. తొలుత రాజధాని అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అంటూ రంగప్రవేశం చేసిన మెయిన్‌హార్ట్ అనుబంధ సంస్థ సెమ్కాప్ అండ్ అసెండర్స్ సింగ్‌బ్రిడ్జ్ కన్సార్షియం.. ఆపై అవినీతికి దారులు వెతికింది. అప్పటి ఏపీ ప్రభుత్వ పెద్దలతో కలిసి కృష్ణానది తీరాన ఏకంగా రూ.66 వేల కోట్ల దోపిడీకి ఈశ్వరన్ స్కెచ్ వేశారనే ఆరోపణలు ఉన్నాయి.
స్విస్ చాలెంజ్ విధానంలో అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా సెమ్కాప్ కన్సార్షియంకు అప్పగించగా.. 1,691 ఎకరాలతోపాటు రూ.5,500 కోట్లు పెట్టే ఏపీ సర్కారుకు 42 శాతం వాటా, కేవలం పర్యవేక్షణ చేసే అసెండర్స్కు 58 శాతం వాటా దక్కేలా ఒప్పందం జరిగిందని మీడియాలో కథనాలు వచ్చాయి. కాగా ప్రపంచంలోనే అవినీతిరహిత దేశాల్లో ఐదో స్థానంలో నిలిచిన సింగపూర్‌లోనూ ఈశ్వరన్ అవినీతి చక్రవర్తిగా విరాజిల్లారు. ఇప్పుడు జైలు పాలయ్యారు.
మెయిన్‌హార్ట్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులు దాదాపుగా వివాదాల్లో కూరుకున్నవే. ఇందులో కొన్ని ప్రాజెక్టులైతే పూర్తయిన దాఖలాలూ లేవు. నర్మదా నదీతీరంలో చేపట్టిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, పాట్నా ఎయిర్పోర్ట్, యమునా ఎక్స్‌ప్రెస్‌వే, వారణాసి కారిడార్, పాకిస్థాన్‌లో చేపట్టిన రావి రివర్‌ఫ్రంట్ ఇలా చెప్పుకొంటూ పోతే ఈ జాబితా పెద్దదే. ఇక, తొలుత రూ. 50 వేల కోట్లుగా ఉన్న మూసీ ప్రాజెక్టు బడ్జెట్.. మెయిన్‌హార్ట్ రంగప్రవేశంతోనే మూడు రెట్లు పెరిగి రూ. 1.5 లక్షల కోట్లకు చేరాయన్న విమర్శలూ వస్తున్నాయి.
నర్మదా నది తీరంలో 240 మీటర్ల ఎత్తుతో (బేస్‌తో కలిపి) సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించేందుకు గుజరాత్ ప్రభుత్వం టెండర్లను పిలిచింది. ప్రాజెక్టును మెయిన్‌హార్ట్ కంపెనీ నేతృత్వంలోని కన్సార్షియం దక్కించుకొంది. అయితే, తొలుత పటేల్ కప్పుకొన్న శాలువా మీద స్వాతంత్య్ర సమరయోధుల వీరగాథలను చెక్కాలని నిర్ణయించారు. అయితే, ప్రాజెక్టు వ్యయం సరిపోదంటూ ఆ పనులను కన్సార్షియం నిలిపేసింది. భూసేకరణపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఆగ్రా- గ్రేటర్ నోయిడాలను కలుపుతూ 165 కిలోమీటర్ల మేర ఆరు వరుసల రహదారి నిర్మాణ మాస్టర్‌ప్లాన్ ప్రాజెక్టును మెయిన్‌హార్ట్ కంపెనీకి యూపీ సర్కారు కట్టబెట్టింది. అయితే, రహదారి నిర్మాణం, భూసేకరణ, మ్యాపింగ్‌లో మార్పులు వంటి వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో నోయి డా ఫిల్మ్‌సిటీ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. రహదారిపై రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగాయి.
రాంచీలో సీవరేజీ డ్రైనేజీ ప్లాన్ రూపకల్పన ప్రాజెక్టును 2005లో అప్పటి ప్రభుత్వం మెయిన్‌హార్ట్‌కు అప్పగించింది. అయితే, ప్లానింగ్‌లో లోపాలు తలెత్తినట్టు కాగ్ ఆరోపించింది. టెండర్ ప్రక్రియను, మెయిన్‌హార్ట్ అర్హతను కూడా కోర్టు ప్రశ్నించింది. నిధులు పక్కదారిపట్టినట్టు విమర్శలున్నాయి. ఇక, పాట్నా ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టు వ్యవహారంలోనూ మెయిన్హార్ట్పై విమర్శలు వచ్చాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాండియా-వారణాసి పట్టణాల మధ్య నాలుగు లేన్ల కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన కాంట్రాక్ట్ ప్లానింగ్‌ను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) మెయిన్‌హార్ట్‌కు అప్పగించింది. రోడ్డు పొడవు 72 కిలోమీటర్లు. అయితే, గతంలో ఉన్న రెండు లేన్లతో పోలిస్తే, నాలుగు లేన్ల రోడ్డు తరుచూ మరమ్మతులకు గురవుతున్నదన్న విమర్శలు ఉన్నాయి.
తెలంగాణ ఆత్మగౌరవ పతాక, తెలంగాణతనానికి నిలువు దర్పణంగా నిలిచిన రాష్ట్ర నూతన సచివాలయం నిర్మాణ బాధ్యతలను నిర్మాణరంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి కేసీఆర్ ప్రభుత్వం అప్పగించింది. డాక్టర్ ఆస్కార్, పొన్ని కాన్సెస్సొవా ఆర్కిటెక్ట్‌ల నేతృత్వంలో 26 నెలల రికార్డు సమయంలో తెలంగాణ ఠీవిని ప్రతిబింబించేలా కొత్త సచివాలయం రూపుదిద్దుకొన్నది.
గత కాంగ్రెస్‌పాలనలో చిమ్మచీకట్లు నిండిన తెలంగాణను వెలుగుల దివ్వెగా మార్చడంలో భాగంగా కొత్తగూడెం-మణుగూరు విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణాన్ని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. ప్రాజెక్టు బాధ్యతలను భారత ప్రభుత్వానికి చెందిన నవరత్న కంపెనీ బీహెచ్ఈఎల్కు అప్పగించింది. ప్రతిపక్షాలు ఎన్ని కేసులు వేసి అడ్డుకోవాలని చూసినా ప్రాజెక్టు నిర్మాణం ఆగలేదు. తెలంగాణ వెలుగులీనింది.
తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ప్రాతిపదిక అని నమ్మిన మాజీ సీఎం కేసీఆర్.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయాలని తలంచారు. విగ్రహ రూపకల్పన బాధ్యతలను పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాంవన్జీ సుతార్‌కు అప్పగించారు. స్మృతివనం బాధ్యతలను ఎస్సీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని డిజైన్ అసోసియేట్స్‌కు ఇచ్చారు.
తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట శ్రీలక్షీనరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్రప్రభుత్వం వెయ్యేండ్లు నిలిచిపోయేలా పునర్నిర్మించింది. యాదగిరిగుట్ట క్షేత్రాభివృద్ధికి ప్రధాన స్థపతులు సౌందర్‌రాజన్, ఆనందాచారి వేలు, ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ఆనంద సాయి సహా వివిధ రంగాలకు చెందిన 44 మంది నిపుణులను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. అలా భక్తజన నారసింహ యాదగిరిగుట్ట సమారోహం ఆవిష్కృతమైంది.