హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఎట్టకేలకు డీఈఈసెట్23 వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఆరు నెలలు ఆలస్యంగా సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ నెల 20 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్టు డీఈఈసెట్ కన్వీనర్ శ్రీనివాసచారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలోనే ఒక విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టారు. తాజాగా సీట్ల భర్తీకి 20న మరోసారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
22 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు, 30న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు 2024 జనవరి 1 నుంచి 3 వరకు ఫీజు చెల్లించాలని శ్రీనివాసచారి తెలిపారు. జనవరి 5న కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని, జనవరి 8 నుంచి తరగతులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 54 కాలేజీలుండగా, వీటిల్లో 3,600 సీట్లున్నాయి. జూన్లో డీఈఈసెట్ నిర్వహించగా, అదే నెలలో ఫలితాలు విడుదలయ్యాయి. ఈ కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో ‘డీఈఈసెట్ కౌన్సెలింగ్లో గందరగోళం’ పేరిట ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.