HYDRAA | దుండిగల్/జగద్గిరిగుట్ట,సెప్టెంబర్9: అమ్మినవారు అంతా సక్రమమే అని నమ్మించారు.. అప్రమత్తం చేయాల్సిన అధికారులు అవేవీ చూడకుండానే అనుమతులిచ్చారు. తీరా లక్షలు, కోట్లు పోసి విల్లాలు కొన్న యజమానులు ఇప్పుడు రోడ్డున పడి నెత్తీనోరు బాదుకుంటున్నారు. హైడ్రా వచ్చి తమ కండ్లెదుటే కలల సౌధాలను నేలమట్టం చేసింది. ఇదేమని అడిగితే.. ‘బిల్డర్‌పై కేసు వేసుకోండి’ అని ఉచిత సలహా ఇచ్చింది. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేట్‌లోని కత్వా చెరువు సమీప లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ బాధితుల పరిస్థితి ఇది! మల్లంపేట పరిధిలోని సర్వేనంబరు 170/3, 170/4, 170/5 లో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కంపెనీ నిర్మించిన పలు విల్లాలు కత్వ చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ఉన్నాయంటూ హైడ్రా రెండు రోజుల కిందట కూల్చివేతలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితులు సోమవారం సాయంత్రం హైడ్రా కార్యాలయానికి వెళ్లి కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌పై వివరాలు వెల్లడించినట్టు తెలిసింది. బాధితులు కూడా తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లను ఆయనకు చూపినట్టు సమాచారం. హైడ్రాపరంగా తామేమీ చేయలేమని చెప్పిన కమిషనర్.. బిల్డర్‌పై కేసు వేసుకోండి అని సలహా ఇచ్చినట్టు తెలిసింది.
అధికారులే అసలు దోషులు!
మల్లంపేట పరిధిలోని సర్వేనంబరు 170/3, 170/4, 170/5లో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కంపెనీ 360 విల్లాలు నిర్మించింది. మాజీ సైనికోద్యోగుల నుంచి 15 ఎకరాలు కొనుగోలు చేసి మరో ఐదు ఎకరాలను ఆక్రమించి విల్లాలు కట్టినట్టు గతంలోనే ఆరోపణలొచ్చాయి. ఇందులో హెచ్ఎండీఏ అనుమతులతో 60 విల్లాలు నిర్మించగా ఆపై గ్రామ పంచాయతీ అనుమతుల పేరిట మరో 300 విల్లాలు నిర్మించారు. కత్వా చెరువును అనుకుని ఉన్న బఫర్/ఎఫ్టీఎల్ ప్రాంతంలో ప్రహరీ నిర్మించి మట్టి పోసి ఎత్తు పెంచారు. 2018 నుంచి ఏడాది కిందటి వరకు క్రయ, విక్రయాలు జరిగాయి. సుమారు 150 గజాల్లో జీ ప్లస్ వన్ తరహా ఇండ్లను రూ.50 లక్షల నుంచి కోటిన్నర వరకు అమ్మారు. పంచాయతీ నుంచి మున్సిపల్‌లోకి మారగా నివాసితులు కరెంట్ బిల్లులు, ఇంటిపన్నులు చెల్లిస్తూ వస్తున్నారు.
ఇప్పుడు హైడ్రా కూల్చివేతలతో హతాశులయ్యారు. గతంలోనే తాము అనుమానంతో ఇక్కడి విల్లాలపై రెవెన్యూ అధికారులను సంప్రదించి భూమి విషయమై స్పష్టత కోరినా సమాచారం ఇవ్వలేదని, ఇప్పుడు అధికారులే దగ్గరుండి హైడ్రాతో కలిసి కూల్చివేయించారని వాపోతున్నారు. ఆదివారం రాత్రి 13 విల్లాలను కూల్చిన అధికారులు, మరో 14 విల్లాలను కూల్చేస్తామని మార్కింగ్ చేశారు. కూల్చివేతల సమయంలో సామాన్లు బయటపడేశారని, పిల్లలు అన్నం తింటున్నా బయటకు పంపారని పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. విల్లాలు విక్రయించిన వారి నుంచి తమకు నష్ట పరిహారం ఇప్పించాలని, లేదా మరోచోట తమకు ఇండ్లు కట్టించేలా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.