
నిజామాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోని రహదారులు రక్తసిక్తమయ్యాయి. మితిమీరిన వేగం పలువురి ప్రాణాలను తీసింది. వేర్వేరు జిల్లాల్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 15 మంది మృత్యువాత పడ్డారు. కామారెడ్డి జిల్లాలో రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. అదే జిల్లా జుక్కల్ మండలం కల్లాలిలో కల్టివేటర్‌ను బైక్ ఢీకొని ఇద్దరు చనిపోయారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో చెట్టును కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. హనుమకొండ జిల్లాలో జరిగిన క్వారీలో టిప్పర్ బోల్తాపడి ముగ్గురు మరణించారు.
నాందేడ్ దర్గాకు వెళ్లొస్తూ..
హైదరాబాద్ అజంపురా డివిజన్లోని మూసానగర్‌లో నివాసముండే మహ్మద్ అమీర్‌తాజ్ ఏసీ టెక్నీషియన్. అదే డివిజన్లోని వినాయకవీధి ప్రాం తంలో మహ్మద్ హుస్సేన్ మినరల్ వాటర్‌ప్లాంట్ నడుపుతున్నారు. వీరిద్దరి కుటుంబాలు మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉన్న దర్గాకు మూడురోజుల క్రితం వెళ్లాయి. శనివారం ఉదయం 9 గంటలకు అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వీరి కారు కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలోని జగన్నాథపల్లిగేట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఒకరు దవాఖానలో మృతిచెందారు. మృతుల్లో కారు నడుపుతున్న మహ్మద్ అమీర్ తాజ్ (28), ఆయన భార్య సనా ఫాతిమా (24), వీరి పిల్లలు ఆన్య పర్వీన్ (2), హన్నాఫ్ ఫాతిమా (4నెలలు)తోపాటు మహ్మద్ హుస్సేన్ (35), ఆయన భార్య తస్లీం బేగం(30) ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన నూర్‌బేగం (5) దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయింది. చిన్నారులు ఆస్మా, హజ్రా బేగం, ఆదిల్ సుల్తానా, హాజీ, హిబా నిజామాబాద్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆస్మా.. సనాఫాతిమా అక్క కూతురు కాగా, మిగిలిన ఐదుగురు చిన్నారులు తస్లీం బేగం పిల్లలు.
బైక్ కల్టివేటర్‌ను ఢీకొని ఇద్దరు మృతి
నిజాంసాగర్: బైక్ కల్టివేటర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో కల్లాలి గ్రామానికి చెందిన శివగొండ (35), సాయిలు (26) బైక్‌పై శనివారం జుక్కల్‌కు వచ్చారు. మధ్యాహ్నం తిరిగి వెళ్తుండగా మార్గమధ్యంలో బాలాజీ గేటు సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్టివేటర్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని బాన్సువాడ దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందారు.
క్వారీలో టిప్పర్ బోల్తా.. ముగ్గురి దుర్మరణం
మడికొండ: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి శివారులోని క్వారీలో టిప్పర్ బోల్తాపడగా ముగ్గురు దుర్మరణం చెందారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన చిత్రం చందు (20), గూడూరు మండలం బొద్దుగొండకు చెందిన తోకల ముఖేశ్ (23), బీహార్‌లోని జమాల్‌పూర్‌కు చెందిన ఎండీ హకీం (22) లక్ష్మీ గ్రానైట్స్‌లో పనిచేస్తున్నారు. వీరిలో చందు హిటాచీ ఆపరేటర్‌గా, ముఖేష్ టిప్పర్ డ్రైవర్‌గా, హకీం హెల్పర్‌గా పనిచేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో క్వారీలోని రాళ్లను టిప్పర్‌లో తరలిస్తున్నారు. అదే ప్రాంతంలో పనిచేస్తున్న చందు, ఎండీ హకీం చలి తీవ్రత కారణంగా టిప్పర్ క్యాబిన్లో కూర్చున్నారు. రాళ్లను అన్లోడ్ చేసే క్రమంలో టిప్పర్ ప్రమాదవశాత్తు పైనుంచి ఒక్కసారిగా పల్టీలు కొడుతూ కింద పడింది. ఈ ఘటనలో చందు, హకీం అక్కడికక్కడే మృతిచెందగా, ముఖేశ్ వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరణించాడు.