హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గాంధీ సహా రాష్ట్రంలోని దవాఖానల అధ్వాన పరిస్థితిని అధ్యయనం చేసేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టీ రాజయ్య నేతృత్వంలో మెతుకు ఆనంద్, సంజయ్‌తో కూడిన బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నది. ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానను త్రిసభ్య కమిటీ పరిశీలించనున్నది. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ సహా రాష్ట్రంలోని దవాఖానలను పరిశీలించనున్నది. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం కేటీఆర్‌తో సమావేశమై కమిటీ విధి విధానాలు, అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు. రాష్ట్రంలో దిగజారిన వైద్య ఆరోగ్య వ్యవస్థపై అధ్యయనం చేసి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.