రంగారెడ్డి, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అద్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. రైతులు నిత్యం సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జిల్లాలో విస్తారంగా వానలు కురవడంతో సాగువిస్తీర్ణం పెరిగిందని, పెరిగిన సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులను అందుబాటులో ఉంచకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని అన్నారు. జిల్లాకు 40 వేల టన్నుల యూరియా అవసరం ఉండగా, ప్రభుత్వం 15 వేల నుంచి 20 వేల మెట్రిక్ టన్నులు కూడా అందించక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ దుస్థితి నెలకొన్నదని మండిపడ్డారు.