హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : వచ్చే సీజన్లో దేశ వ్యవసాయ రంగం ఎరువుల సంక్షోభాన్ని ఎదుర్కోనున్నది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా అన్నిరకాల రసాయన ఎరువుల ధరలు రెట్టింపయ్యాయి. మన దేశం మొదటి నుంచీ ఎరువుల పరంగా దిగుమతులపైనే ఆధారపడుతున్నది. దేశీయ పరిశ్రమలు విదేశీ కంపెనీలతో ఒప్పందం చేసుకొని నేరుగా ఎరువులను, ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటాయి. ప్రస్తుతం ధరలు రెట్టింపు కావడంతో కంపెనీలు ఈ ఏడాది కొత్తగా ఒప్పందాలు చేసుకోలేదు. మరోవైపు దేశంలో నిల్వలు అడుగంటిపోతున్నాయి. మన దగ్గర వానకాలం సీజన్ జూన్లో ప్రారంభం అవుతుంది. మే మొదటి వారం నుంచే రైతులు ఎరువుల కొనుగోళ్లు ప్రారంభిస్తారు. అప్పటికి ఎరువులు అందాలంటే ఇప్పటికే దిగుమతి, కొనుగోళ్లు, సరఫరా ప్రక్రియ ప్రారంభం కావాలి. అయితే సీజన్ మొదలైనా.. రాబోయే సంక్షోభం కండ్లముందు కనిపిస్తున్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది.
పదో వంతు మాత్రమే అందుబాటులో..
దేశానికి ప్రధానంగా డీఏపీ (డై అమ్మోనియం ఫాస్పేట్), ఎంవోపీ (మూరియేట్ ఆఫ్ పొటాష్), ఎన్కేపీఎస్ (నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, సల్ఫర్)లు ఎక్కువగా దిగుమతి అవుతాయి. మన దేశ అవసరాలతో పోల్చితే ప్రస్తుతం మన దగ్గర నిల్వలు దాదాపు పదో వంతు మాత్రమే ఉన్నాయి. ఎంవోపీ 50 లక్షల టన్నులు అవసరం కాగా.. 5 లక్షల టన్నులు మాత్రమే ఉన్నది. ఎన్పీకేఎస్ కోటి టన్నులకుగానూ 10 లక్షల టన్నులు మాత్రమే ఉన్నది. కీలకమైన డీఏపీదీ ఇదే పరిస్థితి. కోటి టన్నులు అవసరం ఉంటే.. 25 లక్షల టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నది. సాధారణంగా మొత్తం ఎరువుల అమ్మకాల్లో ఏప్రిల్-సెప్టెంబ ర్ మధ్య 45 శాతం, అక్టోబర్-మార్చ్ మధ్య 55 శా తం నమోదవుతాయి. ఈ లెక్కన వానకాలం నాటికి కనీసం 45 శాతం ఎరువులు అందుబాటులో ఉండా లి. కానీ ప్రస్తుతం 10 శాతం మాత్రమే ఉన్నాయి.
ఆకాశాన్ని తాకిన ధరలు
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం యూరియా ఎరువుల ధరలను మాత్రమే నియంత్రిస్తున్నది. టన్ను యూరియాకు ధరను నిర్ణయించి రైతులకు అందిస్తున్నది. కంపెనీలపై పడే అదనపు భారాన్ని కేంద్రం భరిస్తుంది. అయితే డీఏపీ, ఎంవోపీ వంటి యూరియేతర ఎరువుల ధరలు మాత్రం కంపెనీల ఇష్టం. కేంద్రం కేవలం కొంత సబ్సిడీ ఇస్తుంది. అంతర్జాతీయంగా ధరలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం దేశంలో డీఏపీ రూ.60 వేలు, ఎంవోపీ రూ.40 వేలు, ఎన్పీకేస్ రూ.43 వేలు ధర పలుకుతున్నాయి. కేంద్రం ఇందులో కొంత సబ్సిడీని కలిపి రైతులకు సరఫరా చేస్తుంది. యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా డీఏపీ రూ.95 వేలు, ఎంవోపీ రూ.57 వేలు, ఎన్పీకేఎస్ రూ.59 వేల వరకు పలుకుతున్నాయి. వీటికి 5 శాతం కస్టమ్స్ డ్యూటీ, 5 శాతం జీఎస్టీ అదనం. అంటే ధరలు 50-90 శాతం పెరిగిపోయాయి. ఈ ధరకు దిగుమతి చేసుకొంటే కచ్చితంగా ఎరువుల ధరలను రెట్టింపు చేయాల్సి వస్తుందన్నది కంపెనీల మాట. లేదంటే ఒక్క డీఏపీకే క్వింటాకు రూ.50 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని, దీనిని ఎవరూ భరించలేరని పారిశ్రామిక వర్గాలు చెప్తున్నాయి.
ఉలుకూ పలుకూ లేని కేంద్రం
ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కేంద్రం నుంచి కనీస స్పందన కనిపించడం లేదు. పెరిగిన ధరలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించింది లేదు. కార్యాచరణపై రాష్ర్టాల అభిప్రాయాలను కూడా కోరడం లేదు. మరో నెలరోజుల్లో కొనుగోళ్లు ప్రారంభం అవుతున్నా.. కార్యాచరణ ప్రకటించలేదు. కేంద్రం వెంటనే తేరుకోవాలని, రాబోయే విపత్తుపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో ఉన్న నిల్వలు..
ఎరువు : పస్తుత నిల్వ : ఏటా వినియోగం
డీఏపీ : 25 లక్షల టన్నులు : కోటి టన్నులు
ఎంవోపీ : 5 లక్షల టన్నులు : 50 లక్షల టన్నులు
ఎన్పీకేఎస్ : 10 లక్షల టన్నులు: కోటి టన్నులు