ఎల్లారెడ్డి రూరల్, జూన్ 23: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన బస్టాండు పరిస్థితి.. ప్రారంభానికి ముందే పంచనామా చేసినట్లయింది. డ్రైవర్ బస్సును రివర్స్ తీస్తున్న క్రమంలో వెనుక ఉన్న బంపర్ ప్రహరీకి తగలడంతో గోడ కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న పలువురు కేకలు వేయడంలో డ్రైవర్ బ్రేక్ వేశాడు. లేకపోతే బస్సు విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టేది. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రహరీ కూలడంతో పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నూతన బస్టాండ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మదన్మోహన్ మంగళవారం ప్రారంభించాల్సి ఉన్నది. ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందే బస్టాండ్ ప్రహరీ కూలడం నిర్మాణంలోని డొల్లతనం బయటపడింది.