సైదాబాద్, మార్చి 18 : చంచల్‌గూడ జైలు నుంచి మంగళవారం మహిళా జర్నలిస్టులు రేవతి, బండి సంధ్య అలియాస్ తన్వీయాదవ్ విడుదలయ్యారు. జైలు వద్ద మీడియాతో రేవతి మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరును విమర్శిస్తే అక్రమ కేసులు బనాయించి జైలులో నిర్బంధించారని చెప్పారు. తమపై పెట్టిన కేసు అక్రమమని అందరికీ తెలుసునని వెల్లడించారు. ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు భయపడేదిలేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నే ఉంటామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ తమకు అండ గా నిలువడానికి జైలు వద్దకు వచ్చిన కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, దాసోజు శ్రవణ్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే పార్టీలకు అతీతంగా అండగా నిలిచిన వారికి, కపిల్ సిబల్, సతీశ్ ఆచార్య ఇలా ఎంతో మంది పెద్దలకు కృతజ్ఞతలు చెప్పారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో స్పందించిన జర్నలిస్టులందరికీ ధన్యవాదాలు తెలిపారు. బెయిల్ మంజూరు చేసిన న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు చెప్పారు. జర్నలిస్టు తన్వీయాదవ్ స్పందిస్తూ చానల్ ద్వారా ప్రజలకు వాస్తవాలు చూపిస్తుంటే తమ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతున్నదని చెప్పారు.
మహిళా జర్నలిస్టులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరినప్పటికీ తిరస్కరించిందని జర్నలిస్టుల తరఫున వాదించిన న్యాయవాది లలితారెడ్డి చెప్పారు. మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు దురుసుగా వ్యవహరించటంతోపాటు మహిళలు అనే కనికరం లేకుండా ఇబ్బందికరంగా అమానుషంగా ప్రవర్తించిన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లామని, దీంతో కోర్టు పోలీసులకు షోకాజ్ నోటీసు జారీ చేసిందని వెల్లడించారు.
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్టంలోని కాంగ్రెస్ ప్ర భుత్వం ఎవరు ప్రశ్నించినా వణికిపోతోం ది. సామాన్యుడు ప్రశ్నించినా, ప్రతిపక్షం ప్రశ్నించినా, ఆఖరికి జర్నలిస్టులు ప్రశ్నించినా బెంబేతెత్తిపోతోంది. ప్రజాపాలనలో ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పడం కూడా జీవితఖైదు విధించేంత తప్పుగా మారింది. ఫోర్త్ ఎస్టేట్‌గా ఉన్న జర్నలిస్టులు ప్రశ్నిస్తే ఏకంగా మరణశిక్ష విధించేంత నేరంగా పరిగణిస్తోంది. మన రా జ్యాంగం దేశంలోని పౌరులందరికీ భావప్రకటన స్వేచ్ఛను కల్పించిందన్న విషయాన్ని మర్చిపోయి ప్రశ్నించే గొంతుకలను ఇబ్బంది పెడుతోంది. తీవ్రవాదులు, ఘోరమైన నేరాలు చేసేవారిపై ప్రయోగించే క్రిమినల్ చట్టాల్లోని సెక్షన్లను సామాన్యులు, జర్నలిస్టులపై ప్రయోగిస్తున్నది. ఇటీవల ప్రభుత్వాన్ని యూట్యూబ్ చానల్ ద్వారా ప్రశ్నించిన మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వీ యాదవ్‌ను అరెస్టు చేయడంతోపాటు వారిపై బీఎన్ఎస్ చట్టంలోని వ్యవస్థీకృత నేరానికి సంబంధించిన 111, 61 (2), 353 (2), 352 సెక్షన్లను, 67 ఐటీ యాక్ట్‌ను ప్రయోగించింది. దీన్ని ‘ఎడిటర్స్ గిల్డ్’, న్యాయస్థానాలతోపాటు పలు వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
మహిళా జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్ర భుత్వం వ్యవహరించిన తీరు కక్షపూరితంగా ఉందని న్యూయార్క్‌కు చెందిన ‘కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్’ (సీపీజే) తమ పోర్టల్‌లో ఎండగట్టింది. ప్రభుత్వా న్ని ప్రశ్నించేవారని నడిరోడ్డుపై గుడ్డలూడదీసి కొడతామని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ బెదిరించడం ఆందోళనకరమని పేర్కొంది. పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ప్రతిజ్ఞ చేసినప్పటికీ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని సీపీజే ఆసియా ప్రోగ్రా మ్ కో-ఆర్డినేటర్ బెహ్లిహ్యి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఇటువంటి బెదిరింపులు, దాడులను కట్టిపెట్టాలని, పత్రికా స్వేచ్ఛపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు.