Telangana | హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘పిల్లి గుడ్డిదైతే.. ఎలుక ఇల్లంతా తిరిగినట్టు’ ఉంది రాష్ట్రంలో పోలీస్‌శాఖ పరిస్థితి. పోలీసు స్టేషన్లలోనే సెటిల్మెంట్లు, మహిళా సిబ్బందిపై లైంగికదాడియత్నాలు, ఇసుకాసురులతో దోస్తానాలు, స్టేషన్‌కు వచ్చే మహిళలను ట్రాప్ చేయడాలు.. అనుకూలమైన నాయకులు వస్తే సకల మర్యాదలు, కేక్ కటింగ్‌లు, అవసరమైతే మందుపార్టీలు నిర్వహిస్తూ పోలీసుశాఖకు మచ్చ తెస్తున్నారు. డ్యూటీ పేరిట టైమ్‌పాస్ చేసేవారిని, అవినీతి ఆరోపణలు ఉన్నవారిని వదిలేసి.. నిజాయితీ అధికారులను వేధిస్తుండడంతో ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో పాలుపోక పలువురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలూ ఉన్నాయి. ఈ విచిత్ర వైఖరి అన్ని జిల్లాల్లో కనిపిస్తున్నా, ఆయా కమిషనరేట్ల సీపీలు, ఎస్పీలు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు.
స్టేషన్లలోనే దారుణాలు..
మెదక్ జిల్లా చిలిప్చేడ్ ఎస్సై యాదగిరి అదే స్టేషన్లో పనిచేస్తున్న మహిళా ఏఎస్సైని కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయం పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేక స్టేషన్ ఆవరణలోనే ఆమె పురుగుమందు తాగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వనస్థలిపురం స్టేషన్ పరిధిలో 100కు కాల్ చేసిన ఓ మహిళతో హెడ్‌కానిస్టేబుల్ జగన్ పరిచయం పెంచుకుని ప్రలోభపెట్టి లోబర్చుకున్నట్లు సమాచారం. డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వమంటే తప్పించుకొని తిరుగుతుండటంతో బాధితురాలు అతడిపై ఫిర్యాదు చేసింది. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం స్టేషన్లో పనిచేసిన భవానీసేన్ అదే స్టేషన్లో పనిచేసిన ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్‌ను రివాల్వర్‌తో బెదిరించి మరీ లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో అతడిని పూర్తిగా సర్వీసు నుంచి తప్పించారు. దీంతో ఏదైనా ఫిర్యాదు కోసం పోలీస్‌స్టేషన్ మెట్లెక్కాలంటేనే మహిళలు భయపడిపోతున్నారు.
దొంగలతోనే దోస్తీ..
లంచాల కోసం ఇసుకాసులతో సీఐ, ఎస్సై ర్యాంకు అధికారులు, కానిస్టేబుళ్లు అంటకాగుతున్నారనడానికి ఇటీవల వీఆర్‌కు అటాచ్ చేసిన ఉందతమే నిదర్శనం. ఈ నెల 3న ఇసుక అక్రమరవాణాదారులతో దోస్తీ చేస్తున్నందుకు మగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను వీఆర్‌కు అటాచ్డ్ చేస్తూ మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశంలో ఒక సీఐని, 14 మంది ఎస్సైలను బదిలీ చేశారు . ఈ విషయంలో కిందిస్థాయి సిబ్బందిని గాడిన పెట్టాలని ఎస్పీలు, సీపీలకు ఐజీ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. మల్టీజోన్-1లోని డిప్యూటీ సీఎం ఇలాఖాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డే లేదు. ఇసుక అక్రమార్కులెవరిని కదిలించినా ‘డిప్యూటీ సీఎం గారి తాలూకా’ అంటూ బెదిరించడం, కుదిరితే డబ్బులివ్వడం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
నిజామాబాద్‌కు చెందిన ఓ విభాగం డీసీపీ వ్యవహారం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నగరంలోని ప్రముఖ హోటల్ నుంచే ఆయన విధులు నిర్వర్తించడం, అక్కడే మందు, విందు, చిందు, మగువ వంటివి ఏర్పాట్లు చేసుకోవడంపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు రాసింది. వీటికి తోడు పోలీసు స్టేషన్లలోనే ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వారి కేసులు ఈ ఏడాది 50కి పైగానే ఉన్నాయి. ఈ మధ్య కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలన్నా కూడా పోలీసులకు ‘స్వామి భక్తి’ పెరిగిపోతున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. వారి పుట్టినరోజులు, పెండ్లి రోజులు స్టేషన్లలో నిర్వహిస్తూ అభాసుపాలవుతున్నారు. ఇటువంటి చర్యలపై డీజీపీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోతే.. వ్యవస్థ ప్రతిష్టను మరింత దిగజార్చుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.