కామారెడ్డి/మిర్యాలగూడ, అక్టోబర్ 29: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో చేపట్టిన ఆందోళనలో ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మోకాళ్లపై అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. రాష్ట్రంలో 15 లక్షల మంది విద్యార్థుల ఉన్నత చదువులకు ఆసరాగా ఉండే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం మీడియాతో చిట్‌చాట్‌లో మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ నిధులు విడుదల చేశామని పేర్కొనడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.