హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): అప్పాజంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు అక్టోబర్‌లో ప్రారంభం కానున్నాయి. మేఘా సంస్థ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) కింద రూ.785 కోట్లతో దీని నిర్మాణ పనులను దక్కించుకొన్నది. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ కూడా పూర్తవ్వడంతో పనులను చేపట్టడానికి మేఘా సంస్థ సిద్ధమైంది. 46 కిలోమీటర్ల దూరం ఉండే ఈ రహదారి నిర్మాణానికి 137.34 హెక్టార్ల భూమిని జాతీయ రహదారుల సంస్థ సేకరిస్తున్నది. భూసేకరణ కోసం దాదాపు రూ.150 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. భూసేకరణ కూడ పూర్తి కావచ్చింది. సెప్టెంబర్ నెలాఖరు వరకు మేఘా సంస్థకు భూమిని అప్పగించనున్నారు.
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలోమీటర్ల మేర నిర్మించే జాతీయ రహదారి కోసం 60 మీటర్ల వెడల్పున భూసేకరణ చేస్తున్నారు. నాలుగు లేన్ల రహదారికి రెండువైపులా సర్వీస్‌రోడ్డును నిర్మిస్తారు. భవిష్యత్తులో ఆరు లేన్ల రోడ్డుగా విస్తరించినా భూసేకరణ సమస్య రాకుండా, సర్వీస్‌రోడ్డు దెబ్బతినకుండా ఉండే విధంగా భూసేకరణ చేస్తున్నారు. మొయినాబాద్, చేవెళ్ల పట్టాణాల చుట్టూ బైపాస్ నిర్మిస్తున్నారు. స్థానిక ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి 2.5 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 20 అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. ఈ మేరకు ఈ రహదారి నిర్మాణ ప్రణాళికను అధికారులు ఖరారు చేశారు. ఎక్కడా హైవే ట్రాఫిక్, లోకల్ ట్రాఫిక్ రెండూ కలిసి ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడకుండా అండర్‌పాస్‌లు, బైపాస్‌లు నిర్మిస్తున్నారు.