ఇల్లెందురూరల్, జూన్ 25 : గాలిదుమారంతో కురుస్తున్న వర్షానికి ఇంటి పైనున్న విద్యుత్తుతీగ తెగిపడడంతో మూత్రవిసర్జనకు వెళ్లిన నర్సయ్యకు ప్రమాదవశాత్తు విద్యుత్తుషాక్ తగిలింది.. అతడిని కాపాడబోయిన కొడుకుకు సైతం షాక్ తగలడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఇంటి వెనుకాల ఆరేసిన బట్టలు తీయడానికి వెళ్లిన నర్సయ్య భార్యకు కూడా విద్యుత్ షాక్ తగలడంతో అపస్మారక స్థితికి వెళ్లింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ఎల్లాపురంలో బుధవారం చోటుచేసుకున్నది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి ఎందిన ఏనుగు నర్సయ్య (60) తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో బాత్రూంకు వెళ్తుండగా.. అప్పటికే తెగిపడి ఉన్న విద్యుత్తుతీగ తగిలి షాక్‌కు గురయ్యాడు. వెంటనే గమనించిన నర్సయ్య కొడుకు ప్రవీణ్ (30) తండ్రిని కాపాడేందుకు హుటాహుటిన పరుగెత్తగా అదే తీగ తగలడంతో విద్యుత్తుషాక్‌కు గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
వీరు మృతిచెందిన విషయాన్ని గమనించని నర్సయ్య భార్య ఎర్రమ్మ ఇంటి వెనుక ఆరేసిన బట్టలు తీసేందుకు వెళ్లగా ఆమెకు కూడా విద్యుత్తు షాక్ తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు తండ్రీకొడుకుల మృతదేహాలతోపాటు అపస్మారక స్థితిలో ఉన్న ఎర్రమ్మను ఇల్లెందు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎర్రమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తండ్రీకొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతుడు ప్రవీణ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.