మెదక్: బెట్టింగ్‌లకు (Betting) అలవాటుపడి డబ్బులు పోగొట్టుకున్న కుమారుడిని చంపేశాడో తండ్రి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లికి చెందిన ముకేశ్ కుమార్ బెట్టింగ్, జల్సాలకు అలవాటుపడ్డారు. దీంతో దురలవాట్లు మానుకోవాలని ముకేశ్‌ను తండ్రి సత్యనారాయణ హెచ్చరించారు. అయినా వినకుండా బెట్టింగ్ కొనసాగిస్తున్న ముకేశ్.. ఇప్పటివరకు రూ.2 కోట్లు పోగొట్టుకున్నారు. ఎన్నిసార్లు చెప్పినా మారకపోవడంతో శనివారం రాత్రి కుమారుడిపై ఇనుపరాడ్డుతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ముకేశ్ మృతి చెందారు.
కాగా, ముకేశ్ భారతీయ రైల్వేలో ఉద్యోగి. ప్రస్తుతం చేగుంట మండలం మల్యాలలో పనిచేస్తున్నారు. బెట్టింగ్ కారణంగా మేడ్చల్‌లో ఉన్న ఇళ్లు, ప్లాటును అమ్మేశారని కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.