లింగంపేట(తాడ్వాయి), అక్టోబర్ 13 : ఇద్దరు చిన్నారులను బావిలోకి నెట్టి ఆపై తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.. తాడ్వాయి మండలం నం దివాడ గ్రామానికి చెందిన చిట్టెపు గుండారెడ్డి – సుగుణ దంపతుల చిన్న కూతురు అపర్ణకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ మండలం నయాగావ్ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డితో పదేండ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాస్‌రెడ్డిని ఇల్లరికం తెచ్చుకున్నారు. వ్యవసాయ పనులు చేస్తూ శ్రీనివాస్‌రెడ్డి కుటుంబాన్ని పోషించేవాడు. అపర్ణ – శ్రీనివాస్‌రెడ్ది దంపతులకు ఇద్దరు కుమారులు విఘ్నేశ్‌రెడ్డి (7), అనిరుధ్‌రెడ్డి (5) ఉన్నారు. శనివారం దసరా సంబురాల్లో పాల్గొన్న శ్రీనివాస్‌రెడ్డి.. రాత్రి 8 గంటల ప్రాంతంలో తన కుమారులను తీసుకొని బయటికి వెళ్లాడు. రాత్రి 10 గంటలైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్యతోపాటు కుటుంబ సభ్యులు వారి కోసం గాలించారు. ఆదివారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన సెల్‌ఫోన్, చెప్పులను గుర్తించారు. బావిలోకి చూడగా ఇద్దరు చిన్నారుల మృతదేహాలు కనిపించగా.. శ్రీనివాస్‌రెడ్డి ఆచూకీ లభ్యం కాలేదు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, కామారెడ్డి రూరల్ సీఐ రామన్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను బయటికి తీయించారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి మృతదేహం కూడా లభించింది. కుటుంబకలహాల కారణంగా పిల్లలతో కలిసి శ్రీనివాస్‌రెడ్డి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బా ధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, విచారణ చే పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.