సత్తుపల్లి రూరల్, డిసెంబర్ 19: కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతదేహాన్ని ఖననం చేసిన చోటే తనువు చాలించడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆదివారం చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్లా రాంబాబు (45) స్వస్థలం సత్తుపల్లి. పిల్లల చదువుల నిమిత్తం కుటుంబంతో కలిసి ఖమ్మంలో నివసిస్తున్నారు. ఈ నెల 15న కుమారుడు భానుప్రకాశ్ (15) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఈ నెల16న మృతిచెందాడు. భానుప్రకాశ్ మృతదేహాన్ని 18న సత్తుపల్లిలోని శ్మశానంలో ఖననం చేశారు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని రాంబాబు అదేరోజు రాత్రి శ్మశానానికి వెళ్లి కుమారుడిని ఖననం చేసిన ప్రదేశంలోనే చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం పట్టణవాసులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. భానుప్రకాశ్, రాంబాబు మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.