రాయపోల్, మార్చి 28: నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ (Farooq Hussain) అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ షాదుల్లా అనే వ్యక్తి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న పారుఖ్ హుస్సేన్ బాధిత కుటుంబ సభ్యులను శుక్రవారం ఉదయం పరామర్శించారు. రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. చిన్న వయసులోనే షాదుల్లా మృతి చెందడం బాధాకరమన్నారు. ఆ కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉండి వారి పిల్లలను మైనార్టీ హాస్టల్లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తామని పేర్కొన్నారు. ఆవేశంతో యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని. వారు ఆత్మహత్యలు చేసుకుంటే కుటుంబాలు అనాథలుగా మిగులుతాయని విచారం వ్యక్తం చేశారు. షాదుల్లా వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నప్పటికీ వ్యాపారంలో నష్టం రావడం, అప్పులు బాధతో ఆత్మహత్య పరిష్కారంకాదన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఆపద ఎక్కడ ఉంటే తాను అక్కడ ఉంటానన్నారు. పదవులు ఎప్పుడూ ఎవరికీ శాశ్వతం కాదని చెప్పారు. తనకు పదవి ఉన్నా లేకున్నా దుబ్బాక ప్రజలతో 30 ఏండ్ల అనుబంధం ఉందని తెలిపారు. తన ప్రాణం ఉన్నంతవరకు దుబ్బాక నియోజకవర్గ ప్రజలను ఎప్పుడు మరిచిపోనని ఆయన గుర్తు చేశారు. గ్రామాల్లో యువకులు మందు కల్లు తాగుడు, బెట్టింగులకు అలవాటు పడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని గుర్తు చేశారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తే విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉంటే అందరూ సంతోషం వ్యక్తం చేస్తారన్నారు. ఆయన వెంట ఉమ్మడి మండల బీఆర్ఎస్ అధ్యక్షులు చింతకింది మంజూరు, సీనియర్ నాయకులు సత్తుగారి కిష్టారెడ్డి, మాజీ సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్ చారి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ యూసుఫ్, ఇసాక్, మహమ్మద్ రఫీ, గ్రామ నాయకులు బాసం నరసింహారెడ్డి, గౌరీ గారి పరుశరాములు, బంగారెడ్డి లింగారెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.