మహదేవపూర్, జూన్ 16: ప్రాజెక్టు పేరు తో తమ భూములను లాక్కున్నారని, అందుకుగానూ తమకు వేరేచోట భూములైనా ఇవ్వాలి లేదా మార్కెట్ రేటు ప్రకారం పరిహారమైనా చెల్లించాలని బాధిత రైతులు డిమాం డ్ చేశారు. ఈ మేరకు ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో ఎర్రచెరువు వద్ద చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను అడ్డుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడు తూ.. తాతల కాలం నుంచి ఈ భూములను సాగు చేస్తూ జీవిస్తున్నామని, వాటికి పట్టాలు సైతం ఉన్నాయని చెప్పారు. తమ భూములను లాక్కొని తమకు తీరని అన్యాయం చేశారని పేర్కొన్నారు. ప్రాజెక్టులో భాగంగా ఎర్రచెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెంపుతో 25 మంది రైతులకు చెందిన సుమారు 50 ఎకరాల సాగుభూమి పోతుందని వాపోయారు. అన్నంపెట్టే భూములను స్వాధీనం చేసుకోవ డం దారుణమని మండిపడ్డారు. మంత్రి శ్రీధర్‌బాబుకు మూ డుసార్లు తమ గోడును వెల్లబోసుకున్నా ఫ లితం లేదని చెప్పారు. బాధిత రైతులకు మరో చోట భూమి ఇప్పించాలని, లేదా మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లించి పనులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాధిత రైతులు జనగామ సరోజన, జనగామ సమ్మక్క, చిలుముల సమ్మక్క, చిలుముల లక్ష్మి, బొడ్డెయ్య, రుద్రమ్మ, రామచంద్రం, చిలుముల రాజేశం, రాజయ్య, తలారి శ్రీనివాస్, రామటెంకి మహేందర్, ఖదీర్ పాల్గొన్నారు.