రాజన్న సిరిసిల్ల, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ధాన్యం కొనకపోవడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో కామారెడ్డి-కరీంనగర్ రహదారిపై వడ్లను పోసి రాస్తారోకో చేపట్టారు. అట్టహాసంగా సెంటర్లు ప్రారంభించిన అధికారులు కొనుగోళ్లు చేపట్టక పోవడంతో ఆదివారం నిరసనకు దిగారు. వందమందికి పైగా రైతులు కామారెడ్డి- కరీంనగర్ రోడ్డుపై బైఠాయించారు. అరగంటకు పైగా వాహనా లు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాతనే మాట్లాడాలని పట్టుబట్టారు. వెం టనే ఆయన కొనుగోళ్లు ప్రారంభించాల ని అధికారులను ఆదేశించడంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు.