మంథని రూరల్, డిసెంబర్ 24: తమ పొలాలకు నీరందించే ఎస్సారెస్పీ సబ్ కెనాల్‌ను పూర్వాంచ సోలార్ కంపెనీ యాజమాన్యం కబ్జా చేసిందని, వెంటనే కాలువను పునరుద్ధరించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా మంథని మండలం పోతారం రైతులు మంగళవారం సోలార్ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామంలోని తమ పొలాలకు ఎస్సారెస్పీ ఎల్-6 సబ్ కాలువ కింద 70 ఎకరాల ఆయకట్టు ఉందని చెప్పారు. సోలార్ కంపెనీ యాజమాన్యం కెనాల్లో పైపులు వేసి, మట్టి కప్పేయడంతో నీరు రాక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. కంపెనీ యాజమాన్యం, అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో హైకోర్టుకు వెళ్లినట్టు గుర్తుచేశారు.
ఆరు వారాల్లో పొలాలకు నీరందించాలని కోర్టు తీర్పునిచ్చినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాలువ పునరుద్ధరించాలని కోరితే సోలార్ కంపెనీ యాజమాన్యం తమపై దాడులు చేసేందుకు యత్నిస్తున్నదని వాపోయారు. తమకు న్యాయం చేయాలని సంజీవ్ అనే రైతు పురుగులమందు తాగేందుకు యత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. మరో మహిళా రైతు ఏఎస్ఐ కాళ్లు పట్టుకొని తమకు న్యాయం చేయాలని వేడుకుంది. కబ్జాకు గురైన కాలువను పోలీసులు రైతులతో వెళ్లి పరిశీలించారు. ఎస్సారెస్పీ డీఈ రాజేందర్‌తో ఏఎస్ఐ ఫోన్లో మాట్లాడగా సోలార్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినా స్పందించడంలేదని డీఈ చెప్పారు. 20రోజుల్లో కాలువను శుభ్రం చేస్తామని సోలార్ కంపెనీ సైట్ ఇన్చార్జి తెలిపారు.
రైతులను పట్టించుకున్నోడే లేడు..
ఈ ప్రభుత్వంలో రైతులను పట్టించుకున్నేడో లేడు. మా ప్రాణం పోయినా సరే కబ్జాకు గురైన కాలువను పునరుద్ధరించుకుంటాం. హైకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చినప్పటికీ సోలార్ కంపెనీ యాజమాన్యం, అధికారులు పట్టించుకోవడంలేదు. గతంలో కాలువ వెంట 12 ఫీట్ల తొవ్వ ఉండేది. ఇప్పుడు అది లేదు. పొలాలకు వెళ్లాలంటే భయంగా ఉంది. వెంటనే కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలి. లేదంటే మళ్లీ కోర్టుకు వెళ్తాం.
– యువ రైతు, బుద్దార్థి సంజీవ్
కాళ్లు మొక్కుతా.. మాకు న్యాయం చేయండి.
మీ కాళ్లు మొక్కుతా సార్, మాకు న్యాయం చేయండి. ఎన్నో ఏండ్లుగా ఎవుసం చేసుకొని బతుకుతున్నం. నీళ్లు లేక పంటలు ఎండుతున్నయ్. పంటకు నీళ్లు వస్తనే మాకు బతుకు. లేదంటే చావే గతి. సోలార్ కంపెనీ వాళ్లు మమ్ముల బతుకనిత్తలేరు. మా భుములకు నీళ్లు రాకుండా చేస్తండ్లు. కోర్టు రైతులకు న్యాయం చేయాలని చెప్పినా వినిపించుకుంటలేరు. ఇప్పటికే చాలా నష్టపోయినం. ఇక మాకు ఓపిక లేదు. న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగుతం.
– పుష్పలత, మహిళా రైతు, పోతారం