మంచిర్యాల, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో తీవ్ర జాప్యంచేస్తూ రైతులపాలిట కాంగ్రెస్ సర్కార్ మరణశాసనం రాస్తున్నది. పంటను కొనే దిక్కులేక రోజుల తరబడి కల్లాల్లో కాపలాకాస్తూ, దిగాలుతో అన్నదాతలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇదే దైన్యంతో మంగళవారం అర్ధరాత్రి ఒక్కరోజే నలుగురు అన్నదాతలు మృత్యువాతపడ్డారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో జరిగిన రెండు వేర్వేరు ఘటనలతో సర్కార్ అలసత్వం కొట్టొచ్చినట్టు బట్టబయలైంది. అకాలవర్షానికి తమ ధాన్యం కాపాడుకొనేందుకు గంపలపల్లిలోని కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లిన తండ్రీకొడుకులు గోడ కూలి మీదపడటంతో మృత్యువాతపడ్డారు. కొత్తూరులోని కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని రక్షించుకొనేందుకు వెళ్లిన మరో ఇద్దరు రైతులు షెడ్డు కూలి మీదపడటంతో అక్కడికక్కడే ప్రాణాలిడిచారు.
ఇదే ఘటనలో మరో ముగ్గురు రైతులు తీవ్రగాయాలపాలయ్యారు. బాధిత కుటుంబాలు, ప్రత్యకసాక్షుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం గంపలపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రానికి స్థానిక రైతు తనుగుల నాగరాజు (48) ఐదెకరాల్లో పండించిన ధాన్యాన్ని 20 రోజుల క్రితం తీసుకెళ్లాడు. 10 రోజుల క్రితం ధాన్యం తూకం వేసిన అధికారులు తరలించకుండా అక్కడే ఉంచారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులు వస్తుండటంతో నాగరాజు తన పెద్ద కుమారుడు తనుగుల అభిరామ్(24)ను వెంట తీసుకొని కొనుగోలు కేంద్రానికి వెళ్లారు. ధాన్యం బస్తాలపై టార్పాలిన్లు కప్పుతుండగా వర్షం మొదలైంది. హడావుడిగా పరదాలు కప్పిన తండ్రీకొడుకులిద్దరూ సమీపంలోని ఓ గోడ వద్దకు వెళ్లి తలదాచుకున్నారు. వర్షం ధాటికి ఆ గోడ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఊపిరాడక అభిరామ్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన నాగరాజును లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచాడు.
లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు కొనుగోలు కేంద్రానికి రైతు గుండారపు వెంకటేశ్(23) 20 రోజుల క్రితం ధాన్యం తెచ్చాడు. ఇంకా తూకం వేయకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులు, వర్షం నుంచి తన ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఆ కేంద్రానికి వెళ్లాడు. ధాన్యపు రాశులపై పరదాలు కప్పి భారీవర్షం వస్తుండటంతో స్థానిక రైతులతో కలిసి సమీపంలోని ఓ షెడ్డులో తలదాచుకున్నాడు. ఈ క్రమంలో ముత్యంపేట గ్రామానికి చెందిన నెల్కె లచ్చన్న(48) తన కొడుకును లక్షెట్టిపేట చౌరస్తా వద్ద హైదరాబాద్ బస్ ఎక్కించి, తిరిగి వెళ్తుండగా వర్షం ఎక్కువ కావడంతో రోడ్డు పక్కన బండి నిలిపి రైతులున్న అదే షెడ్డులోకి వెళ్లాడు. భారీ ఈదురుగాలులకు ఒక్కసారిగా షెడ్డు గోడ కూలి మీద పడటంతో వెంకటేశ్, లచ్చన్న అక్కడికక్కడే మృతి చెందారు. ఇదే ఘటనలో రైతులు ఆకుల మల్లయ్య, ఎంబడి లచ్చన్న, శ్రీదర్ల హరీశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. వారిని లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న శ్రీదర్ల హరీశ్‌ను మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలించారు.
లక్షెట్టిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. ముత్యంపేటకు చెందిన నెల్కె లచ్చన్న మృతదేహాన్ని చూసిన కూతురు, కుమారుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తండ్రిని విగతజీవిగా చూసి గుండెలవిసేలా రోదించారు.‘ప్లీజ్ డాడీ.. లే డాడీ.. ఒక్కసారి చూడు డాడీ!’ అంటూ ఆ పిల్లలు తల్లడిల్లిన తీరు చూసి అక్కడున్న వారంతా కంటతడి పెట్టుకున్నారు. తనుగల నాగరాజు, అభిరామ్ మృతితో తమ కుటుంబం రోడ్డుపై పడిందంటూ నాగరాజు భార్య మమత బోరుమన్నారు. ‘గవర్నమెంట్ జాబ్‌కు సిద్ధమవుతున్న తన పెద్ద కొడుకు పెళ్లికోసమని ఇంటికొచ్చాడు. ఈలోపు మాయదారి వర్షం వాడిని పొట్టనపెట్టుకున్నది. ఇద్దరూ చనిపోయాక నేనెట్టా బతికేది’ అంటూ ఆమె విలపించిన తీరు అందరినీ కదిలించింది.

లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖానలో మృతుల కుటుంబాలను, బాధిత రైతులను బుధవారం మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు పరామర్శించారు. మృతుల కుటుంబాలను అన్నివిధాలుగా అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు. తూకం వేసి 10 రోజులవుతున్నా ధాన్యం తరలించకుడా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఆర్డీవో పీడీపై, జాయింట్ కలెక్టర్‌పై, జిల్లా కలెక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం లక్షెట్టిపేట తహసీల్దార్ దిలీప్‌కుమార్‌పై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన 24 గంటల్లో ధాన్యాన్ని తరలించాలి? లేదా? మీ కలెక్టర్‌ను అడగండి.. అని అధికారులను నిలదీశారు. ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడానికి, తమ పంటను కాపాడుకోడానికి వెళ్లిన రైతుల మృతికి కారణం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అనిమాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆరోపించారు.
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నెలల తరబడి కాంగ్రెస్ ప్రభుత్వం పంట కొనుగోళ్లు చేపట్టకుండా రైతుల ఉసురు పోసుకుంటున్నదని వ్యవసాయశాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో వేర్వేరు సంఘటనల్లో కొనుగోలు కేంద్రాల వద్ద నలుగురు రైతులు మరణించడం, పలువురు రైతులు గాయాల పాలవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యతారాహిత్యమేనని మండిపడ్డారు. అవి ప్రమాదవశాత్తూ జరిగిన మరణాలు కావని, నిర్లక్ష్యపూరిత జాప్యంతో ప్రభుత్వం చేసిన హత్యలుగా అభివర్ణించారు. మూడురోజుల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఏడుగురు రైతులు చనిపోవడం అత్యంత బాధాకరమని బుధవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. పంటలను యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు ఉండి ప్రాణాలిడుస్తున్న రైతులవి.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లాలో ఇటీవల రెండు వేర్వేరు ఘటనల్లో కొనుగోలు కేంద్రాల వద్ద వర్షం, ఈదురుగాలుల ధాటికి గోడ, షెడ్డు కూలి నలుగురు రైతులు దుర్మరణం చెందడం, పలువురు రైతులు గాయాల పాలవడం బాధాకరమని పేర్కొన్నారు. బుధవారం ఎక్స్ వేదికగా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మరణించిన రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, గాయపడిన రైతులకు మెరుగైన వైద్యసాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటను వారాల తరబడి కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలసత్వం ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. వివిధ కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతూ మూడు రోజుల్లోనే ఏడుగురు రైతులు మరణించారని, ఇవన్నీ రాష్ట్ర సరార్ చేసిన హత్యలేనని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న అన్ని పంటలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
‘ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్షెట్టిపేట మండలంలో బలైన నలుగురు రైతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలు, రైతులతో కలిసి ఉత్కూర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో పంటలు కొనుగోలు చేయకపోవడం, కొన్న ధాన్యాన్ని తరలించకపోవడంతోనే రైతులు అర్ధరాత్రి కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. నలుగురు రైతులదీ ప్రభుత్వ హత్యలేనని ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ తరఫున ఒక్కొక్కరికి రూ.5 లక్షల సాయం అందిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కలెక్టర్, సీఎస్‌కు ప్రతిపాదనలు పంపుతామని, దానికి సంబంధించిన కాపీని అందజేసి, ధర్నాను విరమించాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) చంద్రయ్య కోరారు. దీంతో సాయంత్రం ధర్నా విరమించారు. ఈ సందర్భంగా తమను ఆదుకోవాలని కోరుతూ నాగరాజు భార్య మమత డీసీపీ, జేసీ కాళ్లు పట్టుకొని వేడుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది.