అక్కన్నపేట, నవంబర్ 14: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామ సర్వే నంబర్ 312లో ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు యత్నిస్తున్నది. దీంతో ఈ విషయమై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. తాము ఎన్నో ఏండ్లుగా సాగుచేసుకుంటున్న భూములను ఇండస్ట్రియల్ పార్కు పేరిట లాక్కోవద్దని బాధిత రైతులు గురువారం చౌటపల్లి స్టేజీ వద్ద ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నాకు గ్రామ అఖిలపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులు ఇండస్ట్రియల్ పార్కు సర్వే పేరిట అత్యుత్సాహం చూపుతున్నారని, తమకు విషయం చెప్పకుండా సంతకాలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది సరైన పద్ధ్దతి కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బెదిరింపులు, అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇండ్లకు దగ్గరలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయడంతో చాలా ఇబ్బందులు ఎదరువుతాయని చెప్పారు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులతోపాటు స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్కు వినతి పత్రాలు అందజేశామని తెలిపారు. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.