అబ్దుల్లాపూర్మెట్ : పాడి రైతులు మేలు రకాల గడ్డి జాతులను సాగు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ పశుగ్రాస సంస్థ విస్తరణాధికారి అంజు బసేరా అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజగూడ గ్రామంలో సేవ్ పౌండేషన్ అధ్యక్షతన సర్పంచ్ బుర వీరస్వామిగౌడ్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన గడ్డి విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై కేంద్ర ప్రభుత్వ పశుగ్రాస సంస్థ డైరక్టర్ బిసింగ్తో కలిసి 40మంది పాడి రైతులకు జొన్నబోండ, యాయట్రి, గనుపులు వంటి పలు రకాల గడ్డి విత్తనాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ఎకరాల భూమిలో సూపర్ వేపియర్ గడ్డి సాగు చేసుకుంటే పది ఆవులు, పది గెదేల పోషణతో పాటు పాడి దిగుబడిని పెంచుకోవచ్చన్నారు. పశుపోషణలో రైతులకు మంచి ఆదాయం ఉందన్నారు. గ్రామాలు నగరానికి దగ్గరలో ఉన్నందున పాలకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకొని పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సేవ్ పౌండేషన్ సీఈఓ మూల కృష్ణగౌడ్, సురేష్, వార్డు సభ్యులు, వీఏఓ రాధిక, మహిళా రైతులు ఉన్నారు.