లింగంపేట (తాడ్వాయి), సెప్టెంబర్ 20: వ్యవసాయ రుణాలు పొందిన ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘ పాలకవర్గ సభ్యులను రైతులు శుక్రవారం నిర్బంధించారు. సొసైటీ పాలకవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుసుకున్న రైతులు అక్కడికి వెళ్లారు. సహకార సంఘం చైర్మన్ కపిల్రెడ్డి, సీఈవో నర్సింహులు, డైరెక్టర్లను విండో కార్యాలయంలో నిర్బంధించారు.
రుణమాఫీ మాఫీ చేయాలని నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి పీసీసీ హోదాలో కౌలు రైతులకు, ఉపాధి హామీ కూలీలకు రైతు భరోసా కల్పిస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులు నర్సింహులు, సుధాకర్, గంగారెడ్డి, రమేశ్, నారాయణ, స్వామి, సుధాకర్ తదితరులు నిరసనలో పాల్గొన్నారు.