హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో విఫలమైన సర్కారు.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది. గుళికల యూరియా కొరత నేపథ్యంలో రైతులకు నానో (లిక్విడ్) యూరియా బాటిళ్లను కట్టబెడుతున్నది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎరువుల వ్యాపారులకు, మార్క్‌ఫెడ్ అధికారులకు ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. దీంతో మార్క్‌ఫెడ్ ద్వారా ఎరువులు విక్రయించే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) నానో యూరియా పంపిణీని తప్పనిసరి చేశాయి.
‘నానో యూరియా వద్దు మొర్రో’ అని మొత్తుకుంటున్నా.. వినకుండా, కచ్చితంగా తీసుకోవాల్సిందేనని బెదిరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో సాధారణ యూరియాతోపాటు కచ్చితంగా ఒకటో రెండో బాటిళ్ల నానో యూరియా కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. బస్తా యూరియాతో పోల్చితే దీని ధర తక్కువని చెప్తూ రైతులకు అంటగడుతున్నారు. యూరియా బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.266 ఉండగా 500 మిల్లీలీటర్ల నానో యూరియా బాటిల్ ధర రూ.225 గా ఉన్నది. యూరియా కొరత నేపథ్యంలో బస్తాను రూ.350-400కు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఈ వానకాలం సీజన్‌కు రాష్ర్టానికి 9.8 లక్షల టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. జూలై నెల వరకు 6.6 లక్షల టన్నుల యూరియా సరఫరా కావాల్సి ఉండగా 3.35 లక్షల టన్నులు మాత్రమే రాష్ర్టానికి చేరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత తీవ్రమైంది. రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూరియా కొరతను తీర్చడంతోపాటు రైతుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రభుత్వం నానో యూరియాను సరఫరా చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ఇందులో భాగంగానే మార్క్‌ఫెడ్ ద్వారా క్షేత్రస్థాయి అధికారులకు టార్గెట్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఒక ప్యాక్స్ ద్వారా విక్రయించే మొత్తం యూరియాలో కచ్చితంగా 25% నానో యూరియా విక్రయాలు ఉండాల్సిందేనని ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. వాస్తవానికి తొలుత నానో యూరియా అమ్మకాలను 50 శాతంగా నిర్ణయించాలని భావించినట్టు తెలిసింది. అయితే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో 25 శాతంతో సరిపెట్టినట్టు సమాచారం. దీంతో ప్యాక్స్ అధికారులు చేసేదేమీ లేక రైతులకు యూరియా బస్తాతోపాటు ఒక బాటిల్ నానో యూరియా తీసుకోవాలని షరతు పెడుతున్నారు. నానో యూరియా తీసుకుంటేనే గుళికల యూరియా బస్తా ఇస్తామని.., లేదంటే ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నట్టు తెలిసింది.
సంప్రదాయ యూరియా వినియోగానికి అలవాటుపడిన రైతులు నానో యూరియా పట్ల విముఖత చూపుతున్నారు. నానో యూరియా వల్ల పంటలకు లాభం ఉండదనే అభిప్రాయం రైతుల్లో నెలకొన్నది. గుళికల యూరియాతో పోల్చితే నానో యూరియా పంటలపై ఆలస్యంగా ప్రభావం చూపుతున్నదని, పంట దిగుబడి కూడా తక్కువగా వస్తున్నదనే ఉద్దేశంతో రైతులు దానిని వాడేందుకు వెనుకంజ వేస్తున్నారు. పంట కాస్త పెరిగిన తర్వాత పిచికారి చేయడానికి ఇది సులువుగా ఉంటుంది.
కానీ, పంట వేసే సమయంలోనే రైతులు యూరియా చల్లుతారు. నానో యూరియా వాడకంపై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో నష్టాలు జరుగుతున్నాయి. వాస్తవానికి 15 లీటర్ల నీళ్లలో నానో యూరియా బాటిల్‌కు ఉండే మూత (క్యాప్)తో మూడు మూతల లిక్విడ్ కలపాలి. దీంతోపాటు పొలంలో ఒకేచోట ఎక్కువ మొత్తంలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎక్కువ మొత్తంలో పడినచోట పంట చనిపోతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు నానో యూరియా వినియోగానికి విముఖత వ్యక్తంచేస్తున్నట్టు తెలిసింది. రైతుల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా అధికారులు మాత్రం రైతులకు నానో యూరియా కట్టపెడుతుండటం విమర్శలకు దారితీస్తున్నది.