ఇల్లెందు/శాలిగౌరారం/ ఆదిలాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : పత్తి అమ్మకానికి రైతులు పడిగాపులు పడుతున్నారు. సీసీఐ అధికారులు పత్తి పంటకు 8110 మద్దతు ధర ప్రకటించినప్పటికీ తేమ శాతం 12 కన్నా ఎక్కువగా ఉంటే కొనుగోళ్లు చేయడంలేదు. ఆదిలాబాద్‌లో సోమవారంనుంచి సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించడంతో రైతులు పెద్ద ఎత్తున పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారు. తేమ శాతం ఎక్కువగా ఉన్నందున పత్తిని కొనబోమని అధికారులు చెప్పడంతో రెండు రోజులుగా పత్తిని ఆరబెడుతూ మార్కెట్ యార్డుల్లో రాత్రి, పగలు కాపలా ఉంటున్నారు. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముదామనుకుంటే క్వింటాలుకు రూ.6810 చొప్పున కొనుగోలు చేస్తామంటున్నారని రైతులు తెలిపారు.
వర్షాలతో పంట దిగుబడులు సగానికి పడిపోగా సీసీఐ అధికారుల తీరుతో పూర్తిగా నష్ట పోతున్నామని రైతులు వాపోయారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మాధారం కలాన్‌లోని టీఆర్ఆర్ కాటన్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న రైతులు 27న డేట్ ఇవ్వడంతో విక్రయించేందుకు పెద్ద ఎత్తున పత్తిని తీసుకొచ్చారు. తేమశాతం అధికంగా ఉన్నందున పత్తిని కొనుగోలు చేయబోమని.. మళ్లీ ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పడంతో ఆగ్రహించిన రైతులు పత్తికి నిప్పు పెట్టి ధర్నాకు దిగారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కొమరారం రైతు వేదిక ఎదుట మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్, అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) ఆధ్వర్యంలో రైతులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు నాయిని రాజు, ఏఐయూకేఎస్ నాయకుడు బుర్ర వెంకన్న మాట్లాడుతూ వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, ప్రభుత్వ మద్దతు ధర రూ.2,400 చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.